కమనీయం.. శ్రీవారి కల్యాణోత్సవం

21 Aug, 2022 12:26 IST|Sakshi

కల్యాణ వేంకటేశ్వరుడిని తిలకించి తన్మయులైన భక్తజనం

ముగిసిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు

నెల్లూరు (బృందావనం): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శ్రీవారి ఆనంద నిలయంలో శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. టీటీడీ, వీపీఆర్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఐదు రోజులుగా జరుగుతున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా చివరి రోజు శనివారం దేవదేవేరుల కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి, న్యూఢిల్లీ ఎస్వీ టెంపుల్‌ ఎల్‌ఏసీ అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు కల్యాణ వధూవరులకు  పట్టు వస్త్రాలు సమర్పించారు.  సంప్రదాయ బద్ధంగా సాయంత్రం 6.30 గంటలకు వేదపండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణ వేదికపై వేంచేపు చేశారు.

అనంతరం రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాకంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని, సంకల్పం, భక్తసంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా కల్యాణో త్సవాన్ని నిర్వహించారు. అనంతరం నక్షత్రహారతి, మంగళహారతులతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. భక్తులు వేలాదిగా హాజరై కల్యాణ వేంకటేశ్వరుడిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందడోలికల్లో ఓలలాడారు. గోవింద నామస్మరణతో పులకింతులయ్యారు. అంతకు ముందు సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకరణలో శ్రీనివాసుడు భక్తులను కరుణించారు. రాత్రి 10 నుంచి 10.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు నిర్వహించారు. తదుపరి రాత్రి 10.30 గంటల తర్వాత ఏకాంత సేవ జరిగింది. చివరి సేవతో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి, న్యూఢిల్లీ ఎస్వీ టెంపుల్‌ ఎల్‌ఏసీ అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, తిరుపతి ఎమ్పీ డాక్టర్‌ గురుమూర్తి, ఎమ్మెల్సీ కల్యాణచక్రవర్తి, నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకానాథ్, జేఈఓ సదాభార్గవి తదితరులు పాల్గొన్నారు. 

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి పుష్పయాగం సప్తవర్ణశోభితంగా భక్తులను కనువిందు చేసింది. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో టీటీడీ, వీపీఆర్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, న్యూఢిల్లీ ఎస్వీ టెంపుల్‌ ఎల్‌ఏసీ అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీనివాసుడికి నమూనా ఆనంద నిలయంలో శనివారం ఉదయం పుష్పయాగం నయనానందకరంగా జరిగింది. ఆ దివ్యమనోహర దృశ్యాన్ని వీక్షించి ఆనందభరితులయ్యారు. స్వామి, అమ్మవార్లకు తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు, నూరువరహాలు, కనకాంబరాలు తదితర 12 రకాల పూలు, ఆరు రకాల ఆకులు కలిపి రెండు టన్నుల సుగంధభరిత పుష్పాలతో ఆద్యంతం శోభాయమానంగా సాగిన పుష్పయాగ మహోత్సవాన్ని కనులారా చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఉత్సవాల్లో, నిత్యకైంకర్యాల్లో అర్చకులు, అధికార, అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏదైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చితంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణతో సమస్తదోషాలు పరిహారమవుతాయని విశ్వాసం. వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు.  

నిత్యకైంకర్యాలు 
శ్రీవారికి ఉదయం 6 గంటలకు సుప్రభాతం, 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు.   టీటీడీ గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసులును వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు ఘనంగా సత్కరించారు. 

మరిన్ని వార్తలు