వృక్షాలపై ఔరా చిత్రకళా ‘కాండము’లు

9 Apr, 2021 14:40 IST|Sakshi

ఆర్ట్స్‌ టీచర్‌ వినూత్న ప్రతిభ

చెట్లపై బొమ్మలు చెక్కుతున్న గొర్లె దుర్గారావు

కంచిలి (శ్రీకాకుళం): వృక్షాలే ఆయన కాన్వాస్‌. చెట్ల కాండలు కనిపిస్తే ఆయన తన మెదడుకు పదును పెడతాడు.. అద్భుతమైన బొమ్మ దింపేస్తాడు. ఆ విధంగా వృక్షాలను అందంగా తీర్చిదిద్దుతున్నాడు శ్రీకాకుళం జిల్లా కంచిలికి చెందిన ఉపాధ్యాయుడు గొర్లె దుర్గారావు. తన రెగ్యులర్‌ విధులతోపాటు, తనకిష్టమైన చిత్రకళ సరికొత్త పద్ధతుల్లో ప్రదర్శిస్తున్నారు.

కంచిలిలో ఏపీ బాలయోగి గురుకుల పాఠశాల, కళాశాలలో ఆర్ట్స్‌ టీచర్‌గా గొర్లె దుర్గారావు విధులు నిర్వర్తిస్తున్నాడు. వృక్ష కాండములో కళాఖండాలు సృష్టించడం ఆయన ప్రత్యేకత. గురుకుల విద్యాలయ ఆవరణలో తిత్లీ తుఫాను వలన చెట్లు కూలిపోయాయి. ఈ సమయంలో ఒక టేకు చెట్టు పాఠశాల ఆవరణలో ఉండిపోయింది. పలుచగా.. పెద్ద సైజులో ఆ వృక్షం కాండం ఉండడంతో దుర్గారావు దానిపై తన కళను ప్రదర్శించాలని అనుకున్నాడు. ఈ విధంగా ఆ వృక్షంపై వీలు చిక్కినప్పుడల్లా వివిధ దేవతామూర్తుల ఆకారాలను చెక్కడం ప్రారంభించారు.

ఈ విధంగా చెక్కుతూ ఇప్పటికీ 7 ప్రతిమలను చెక్కారు. గౌతమబుద్ధుడు, రాధాకృష్ణులు, వినాయకుడు, పరశురాముడు, వరాహావతారం, మత్య్సావతారం, కూర్మావతారం ప్రతిమలను చెట్లపై చెక్కారు.ఇవి చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పాఠశాల ఆవరణలో తరగతి గదుల సమీపంలో ఉన్న ఒక చెట్టు మొదలు మీద వినాయకుని ప్రతిమను చెక్కారు. అలాగే పాఠశాల చుట్టూ పలువురు దేశ నాయకుల ఫొటోలు, ఇతర చిత్రాలను గీశారు. ఇతని పనితీరు, శ్రద్ధను ప్రిన్సిపాల్‌ హెచ్‌. సింహాచలంతోపాటు, మిగతా ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు.

మరిన్ని వార్తలు