ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని.. సిక్కోలుకు స్నేహితుడయ్యాడు!

27 Jun, 2022 14:38 IST|Sakshi

దశాబ్దాలుగా ఉద్దానం నేలలో ఇంకిన కన్నీరే.. దాహార్తి తీర్చే జలధార కాబోతోంది. పలాసలో నిర్మితమవుతున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, హిరమండలం నుంచి వచ్చేందుకు  ఉరకలేస్తున్న వంశధార ఉద్యానవనానికి కొత్త ఊపిరి పోస్తున్నాయి. బిడ్డల్ని దేశాలకు పంపి తీరంలో ఎదురుచూస్తున్న తల్లుల నిరీక్షణ ఆగనుంది. భావనపాడు పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌ ఆ బతుకులను మార్చే సాధనాలుగా కనిపిస్తున్నాయి. బతుకంతా అద్దెలు కడుతున్న సామాన్యులకు ఆ యాతన తప్పనుంది. వేలాదిగా నిర్మితమవుతున్న జగనన్న ఇళ్లు వారికి కొత్త చిరునామా అందిస్తున్నాయి. అంతేనా.. వీధి బడి అమ్మ ఒడిలా కనిపిస్తోంది. ఆస్పత్రి ఆధునిక సదుపాయాలతో ఆదుకుంటోంది. పరిహారంలో పరిహాసాలు మాయమయ్యాయి. సంక్షేమాల్లో దళారులు పోయారు. మూడేళ్ల స్వల్ప కాలంలో కనిపించిన మార్పులివి. వేసిన ప్రతి ఓటుకు న్యాయం చేసేలా.. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేలా.. వచ్చిన ప్రతి విమర్శను తిప్పి కొట్టేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలన దిగ్విజయంగా సాగుతోంది. అందుకు సిక్కోలే సాక్షి.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: 
ఏళ్లకు ఏళ్లు వెనుకబడిన జిల్లా అనే ముద్రను మోసిన సిక్కోలు ఇన్నాళ్లకు ప్రగతికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ ప్రాంతంపై చూపిన ప్రేమ దశాబ్దాల నాటి ముద్రను చెరిపేస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం ఇలా అన్ని రంగాల్లో సిక్కోలును ముందుకు నడిపిస్తున్న సీఎం సోమవారం జిల్లాకు రానున్నారు. ఇక్కడ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 43.96 లక్షల మంది తల్లుల ఖాతాలకు అమ్మ ఒడి పథకంలో డీబీటీ ద్వారా బటన్‌ నొక్కి సుమారు రూ.6,594.6 కోట్లను జమ చేయనున్నారు. సీఎం జిల్లా పర్యటనకు ఇప్పటికే కోడి రామ్మూర్తి స్టేడియం వేదికగా నిలిచింది. జిల్లా అంతా ఆయన రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.  

వెనుకబాటుకు సరైన చికిత్స.. 
శ్రీకాకుళంలో వైద్యం అంటే వైజాగ్‌ వెళ్లాల్సిందే అనేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. నాడు–నేడు కింద 83 ఆస్పత్రులను రూ. 47కోట్లతో అభివృద్ధి చేశారు. పాతపట్నం 50 పడకల సామాజిక ఆస్పత్రిని రూ.4.2 కోట్లతో జొన్నవలస ఆస్పత్రిని 2.45కోట్లతో, లావేరులో రూ.1.2 కోట్లతో, సోంపేట సామాజిక ఆస్పత్రిని రూ.4.60కోట్లతో, బారువ సామాజిక ఆస్పత్రిని రూ. 5.60కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. జిల్లాలో కొత్తగా 1200 పోస్టులను భర్తీ చేశారు. రిమ్స్‌లోనూ ఆధునిక సదుపాయాలు కల్పించారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద 2019–20లో 33,5855 మందికి రూ. 85.50కోట్లు,  2020–21లో 34,813 మందికి రూ.78.47కోట్లతో, 2021–22లో 39,306 మందికి రూ. 87.89కోట్లతో, 2022–23లో ఇప్పటివరకు 4,544మంది రూ.11.03 కోట్లతో వైద్య సేవలందించారు. నరసన్నపేట ఆస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేశారు.  

గంగపుత్రుల బెంగ తీరేలా.. 
193 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం నుంచి మత్స్యకారులు ఏటా వలస వెళ్తుంటారు. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు ప్రభుత్వం జిల్లాలోనే ప లు ప్రాజెక్టులు నిర్మిస్తోంది. భావనపాడులో రూ. 3200కోట్లతో పోర్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. బుడగట్లపాలెంలో రూ.332 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం చేపడుతున్నారు. మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణం చేపడుతున్నారు. 

 అన్నదాతకు వెన్నుదన్ను.. 
వ్యవసాయాధారిత జిల్లా అయిన శ్రీకాకుళానికి సాగునీటి వనరులకు కొదవ లేదు. కానీ వాటిని సమర్థంగా వినియోగించుకోవడంలోనే ఉంది చిక్కంతా. ఈ సమస్యలను పరిష్కరిస్తూ వంశధార, నాగావళి నీళ్లను ఉరకలెత్తిస్తున్నారు. నేరడీ బ్యారేజీ వివాదాన్ని కొలిక్కి తెచ్చారు. దీని కోసం ఒడిశా సీఎంతోనూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. మడ్డువలస రెండో దశ పనులకు రూ.26.65కోట్లు మంజూరు చేశారు. దీని ద్వారా అదనంగా 12,500 ఎకరాలకు ప్రధాన కుడి కాలువ ద్వారా సాగునీరు అందనుంది. వంశధార రిజర్వాయర్‌ నింపేందుకు గొట్టా బ్యారేజీ వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.  

అన్న మాట ప్రకారం.. 
తిత్లీ తుఫాన్‌ తర్వాత పరిహారం పంపిణీలో చాలా మంది అర్హులకు అన్యాయం జరిగింది. దీనిపై అప్పట్లోనే వైఎస్‌ జగన్‌ అదనపు సాయం చేస్తానని మాట ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకుంటూ తిత్లీ తుపానులో నష్టపోయిన వారికి ఏకంగా ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.3000, జీడి తోట హెక్టార్‌కు రూ.50 వేలు మంజూరు చేశారు. దీంతో జిల్లాలో 90,789 మందికి రూ.182.60 కోట్ల అదనపు పరిహారం అందించారు. అలాగే వంశధార నిర్వాసితులకు కూడా హామీ ఇచ్చినట్లుగా అదనంగా రూ.216.71 కోట్ల పరిహారాన్ని తాజాగా అందజేశారు.  

చదవండి: తొలుత డిమాండ్‌ చేసి.. ఆ తర్వాత ప్లేట్‌ ఫిరాయించి

శాశ్వత చిరునామా.. 
జిల్లాలో 1,10,825 మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు అందజేశారు. వాటిలో మొదటి విడతగా 83,456 ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఊళ్లకు ఊళ్లనే కడుతున్నారు.

శాశ్వతంగా నిలిచేలా.. 
అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలతో ఇప్పటికే విద్యకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చిన సీఎం జిల్లాలోనూ శాశ్వతంగా నిలిచిపోయేలా పలు ప్రాజెక్టులు ప్రకటించారు. పొందూరులో డిగ్రీ కళాశాల, ఆమదాలవలస మండలం తొగరాంలో డిగ్రీ కళాశాల, సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో వెటర్నరీ పాలిటెక్నికల్‌ కళాశాల, ఆమదాలవలస మండలం తొగరాంలో అగ్రికల్చరల్‌ పాలిటెక్నికల్‌ కాలేజీ ఏర్పాటు, ఆమదాలవలస కేజీబీబీ బాలికల పాఠశాలను జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేయడం, పొందూరులో బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాల ఏర్పాటు, పలాసకు డిగ్రీ కళాశాల మంజూరు, పలాసలో ఫిషరీస్‌ కళాశాల అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ మంజూరు, నరసన్నపేటలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నిర్మాణం వంటివి సీఎం జిల్లాపై చూపిస్తున్న అభిమానానికి తార్కాణాలు. నాడు–నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు పూర్తిగా మార్చేశారు. 2019–20లో 1247 పాఠశాలలను రూ.286.26 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 2020–21లో 884 పాఠశాలలను రూ.258.70కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే 597 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి.  

గ్రామ స్వరాజ్యం.. 
సిక్కోలులో గ్రామ స్వరాజ్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా కొన్ని భవనాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో 833 సచివాలయాలతో పాటు 3154 కొత్త కార్యాలయ భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. రూ.810.32 కోట్లతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. 834 రైతు భరోసా కేంద్రాలు, 685 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, 802 అంగన్‌వాడీ భవనాలు, 2556 సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇటీవలే జిల్లాలో ఐదువేల మందికిపైగా సచివాలయ ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులయ్యారు. 

ప్రగతి దారులు.. 
జిల్లాలో 480 కిలోమీటర్ల పొడవునా 79 ఆర్‌అండ్‌బీ రహదారులను రూ.129కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందులో స్టేట్‌ హైవే 178.92 కిలోమీటర్లు, మేజర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్లు 302 కిలోమీటర్లు ఉన్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో 890 కిలోమీటర్ల పొడవునా రూ.527కోట్లతో 436 పనులు చేపడుతున్నారు. ప్రత్యేక మరమ్మతుల కింద 275 కిలోమీటర్ల పొడవున రూ.73.25కోట్లతో 54 రోడ్లు బాగు చేస్తున్నారు. ఏపీ రూరల్‌ రోడ్డు ప్రాజెక్టు వర్క్స్‌ కింద రూ.350 కోట్లతో 480 కిలోమీటర్ల పొడవున 312 రోడ్లను నిర్మిస్తున్నారు. ఏపీ గ్రామీణ రహదారుల రెన్యువల్‌ వర్క్స్‌ కింద రూ.50 కోట్లతో 200 కిలోమీటర్ల పొడవున 83 పనులు చేపడుతున్నారు. శ్రీకాకుళం నగరంలో రూ.5కోట్లతో 72 రహదారులు వేస్తున్నారు.  

చదవండి: నగదు డ్రా చేయడం రాని అమాయకులే టార్గెట్‌...ఏకంగా 14 ఏటీఎం కార్డులు..

మరిన్ని వార్తలు