ముందు రాతలు మార్చి, తర్వాత అధికారులను ఏమార్చాలి

31 Jul, 2021 16:55 IST|Sakshi

ముందు రికార్డుల్లో రాతలు మార్చాలి. తర్వాత అధికారులను ఏమార్చాలి. ఇదీ ప్లాన్‌. కానీ అంతా అనుకున్నట్టు జరగదు కదా.. సంపూర్ణ పోషణ పాల అక్రమ రవాణా కేసులో కొందరు అంగన్‌వాడీ సిబ్బంది తప్పు మీద తప్పు చేస్తున్నారు. పాత తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు కొత్త తప్పులు చేస్తున్నారు. అష్ట దిగ్బంధనమవుతున్న దశలో రికార్డుల రూపురేఖలు కూడా మార్చేస్తున్నారు. వీరి తీరు అధికార వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

సాక్షి, శ్రీకాకుళం: వీరఘట్టం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో రికార్డుల దిద్దుబాట్లు జోరుగా జరుగుతున్నాయి. పాల ప్యాకెట్ల సరఫరాలో తేడాలు స్పష్టంగా కనిపించడంతో వాటిని కప్పిపుచ్చుకునేందుకు రికార్డుల్లో అంకెలు మార్చుతున్నారు. రెండు రోజులుగా సెక్టార్‌ మీటింగ్‌లని చెప్పి, కార్యకర్తలను పిలిచి, సూపర్‌వైజర్లు దగ్గరుండి ఈ తంతు జరిపి స్తున్నారు. ఈ నెల 3వ తేదీన భామిని మండలం బత్తిలి చెక్‌పోస్టు వద్ద పాలప్యాకెట్ల అక్రమ రవాణా వెలుగు చూసిన నాటి నుంచి నేటి వరకు ఈ వ్యవహారం అనేక మలుపులు తీసుకుంటోంది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఒకవైపు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారులు రంగం సిద్ధం చేస్తుంటే.. మరోవైపు ప్రాజెక్టు పరిధిలో ఆ చర్యల నుంచి తప్పించుకునేందుకు, న్యాయపరంగా దొరకకుండా ఉండేందుకు రికార్డులు దిద్దుబాటు చేస్తున్నారు. ఇదే విషయమై సమాచారం తెలుసుకున్న ‘సాక్షి’ అక్కడికి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసేసరికి రికార్డులు మూసేయండంటూ కార్యకర్తలు సైగలు చేశారు. కానీ లాభం లేకపోయింది.  

ఏం జరిగిందంటే..? 
►ఇటీవల భామిని మండలం బత్తిలి చెక్‌పోస్టు వద్ద పోలీసులకు పట్టుబడిన పాల ప్యాకెట్లలో తేడాలపై రికార్డులు దిద్దుబాట్లు జరపాలంటూ అంగన్‌వాడీ కార్యకర్తలను సూపర్‌వైజర్‌ పట్టుబట్టారు.  
►ఐసీడీఎస్‌ స్టాక్‌ పాయింట్‌ నుంచి డెలివరీ చేసిన రికార్డులకు, అంగన్‌వాడీ కేంద్రాలకు చేరిన పాలు నిల్వల రికార్డులకు వ్యత్యాసం ఉంది.  
►ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి సరఫరా చేసిన పాల నిల్వల్లో వ్యత్యాసం ఉండడం, అవే నెలలకు సరఫరా చేసిన పాల ప్యాకెట్లు పోలీసు లు పట్టబడడంతో దర్యాప్తు చేస్తున్నారు. 
►వీరఘట్టం ఐసీడీఎస్‌ పీఓ, సూపర్‌వైజర్లు స్టాక్‌ పాయింట్‌ వద్ద పర్సంటేజీ రూపంలో పాల ప్యా కెట్లు మినహాయించి మిగిలిన పాలను నెలల వా రీగా అంగన్‌వాడీ కేంద్రాలకు అందజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే సీడీపీఓ సెలవులో ఉన్నారు. ప్రస్తుతం సూపర్‌వైజర్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.  

ఏం చేస్తున్నారంటే..? 
వీరఘట్టం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో సూపర్‌వైజర్‌ జె.జ్ఞానమ్మ ఆధ్వర్యంలో వంగర, వీరఘట్టం మండలాల సెక్టార్‌ పరిధి అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశం గురు, శుక్రవారాల్లో జరిగింది. 
►ఇప్పటికే ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించిన రికార్డులను అంగన్‌వాడీ కార్యకర్తలు దిద్దుబా టు చేసేశారు. వాటిలో కూడా తేడాలుండటంతో సెక్టార్‌ సమావేశంలో సూపర్‌ వైజర్‌ జె.జ్ఞానమ్మ ఒత్తిడి మేరకు పీఓ కార్యాలయం వద్ద ఉన్న రికార్డులు దిద్దుబాటు చేస్తున్నారు. తొలుత కార్యకర్త లు సతాయించినా.. ఈ గండం నుంచి బయటపడాలంటే ఇలా చేయాల్సిందేనంటూ ఒత్తిడి చేసినట్టు సమాచారం. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న రికార్డుల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నా రులు పేర్లు కొన్ని చోట్ల(ఏప్రిల్, మే, జూన్‌) నెలలకు సంబంధించి తొలగించడం, కొన్ని తప్పుడు పేర్లు యాడ్‌ చేయడంతో నిల్వలకు సరిపడినట్లు కాగితాలపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు.  
►కొంత మంది అంగన్‌వాడీ కేంద్రాల్లో లొసుగులు ఉండడంతో కార్యకర్తలంతా ఏమీ చేయలేక ఐసీడీఎస్‌ అధికారులు మాటలకు తలొగ్గి దిద్దుబాటే శరణ్యంగా భావించి రికార్డులు తారుమారు చేస్తున్నారు. 
►అంగన్‌వాడీ కేంద్రాల వద్ద ప్రతి నెల నిల్వ ఉన్న పాలను ఆ తదుపరి నెలకు లెక్క చూపిస్తారు. అ యితే పాల రికార్డులు తప్పుల తడకగా ఉండడంతో ఆ పాలను సూపర్‌వైజర్లు ఓపెనింగ్‌ బ్యాలెన్స్‌లో నమోదు చేయడం లేదు. దీని కారణంగా దర్యాప్తులో గుర్తించిన పాలతోపాటు ఓపెనింగ్‌ బ్యాలెన్స్‌లో షార్టేజీ చూపించారు. దీన్ని దిద్దే ప్రయత్నం చేస్తున్నారు.   

దిద్దుబాటు సరికాదు   
సెక్టార్‌ సమావేశాల్లో రికార్డులు దిద్దుబాటు చేయకూడదు. సీడీపీఓ సెలవులో ఉన్నారు. ఇన్‌చార్జి పా లనలో ఉంది. అక్కడేం జరిగిందో తెలుసుకుని తప్పకుండా చర్యలు తీసుకుంటాం. శనివారం ఆ ప్రాజెక్టుకు వెళ్తాం. రికార్డులన్నీ పరిశీలిస్తాం.   
– జి.జయదేవి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్, శ్రీకాకుళం   

మరిన్ని వార్తలు