అధిక డిమాండ్‌: ఇతర రాష్ట్రాలకు ఎగుమతి

4 Jun, 2021 08:58 IST|Sakshi
ఉద్దానం మామిడిని ఒడిశాకు పంపిస్తున్న రైతులు

ఒడిశాలోని బరంపురం అంబోమార్కెట్‌కు రవాణా

అంబామావాస్యలో గిరాకీ

కవిటి: వాతావరణం సహకరించడంతో ఉద్దానం ప్రాంతంలో మామిడికాయలు విరగకాశాయి. పైగా ఉద్దానం మామిడి రుచిగా ఉంటుండడంతో మంచి డిమాండ్‌ ఉంటుంది. దీంతో రైతులు  స్థానిక వర్తకులు, దళారీలతో ముందస్తు ఒప్పందం ప్రకారం కాయలను బరంపురం రవాణా చేస్తున్నారు. ఉద్దానంలో పండే కొబ్బరి, మామిడి, పనస వంటి ఉద్యాన పంటలకు ప్రధాన మర్కెట్‌ ఒడిశా. కొన్ని దశాబ్దాలుగా ఇదే రీతిలో వ్యాపారాలు సాగుతున్నాయి. ప్రస్తుతం లాక్‌డన్‌ కారణంగా ఒకపూట మాత్రమే లావాదేవీలకు ఆస్కారం ఉండడంతో వ్యాపారాలు పరిమితంగా సాగుతున్నాయి.

ఒడిశా అంబోమార్కెట్‌కు రోజుకు 150 లోడులు టాటామ్యాక్సీ పికప్‌ వ్యానులలో ఉద్దానం నుంచి మామిడికాయలు వస్తున్నట్టు వర్తకులు చెబుతున్నారు. కలెక్టర్‌ రకం టన్ను రూ.8000, దేశవాళీ రకం టన్ను రూ.6000, బంగినపల్లి రకం టన్ను రూ.15,000 ధర పలుకుతోందని అంటున్నారు. రైతులు ఎవరైనా కాయలు కోసి తీసుకువస్తామంటే తామే వాహనం పంపిస్తామని, అన్‌లోడింగ్‌ అయినవెంటనే డబ్బులు చెల్లిస్తామని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు. ఉద్దానంలో పంట కూడా ఇప్పుడేపక్వానికి వచ్చేదశలో ఉంది. నీలాల రకం ఇప్పటికీ లేత దశలోనే ఉన్నాయి. జగన్నాథ రథయాత్ర సమయానికి కోతకు వస్తాయి. మరో 10 రోజుల్లో అంబామావాస్యా (ఒడిశాలో పేరుగాంచిన పండుగ)కు పనస, మామిడిపళ్లను ఒడిశావాసులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీంతో క్రమంగా ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

తరతరాలుగా ఇదే పంథా.. 
ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో పండి కొబ్బరి, మామిడి, పనస పంటలను ఒడిశా ప్రజలే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఉద్దానం పంటను ఒడిశావాసులు ఓ బ్రాండ్‌ ఇమేజ్‌గా భావిస్తారు. గత కొన్ని తరాలుగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.   
- పాతిన చంద్రశేఖరం, రైతు, ముత్యాలపేట, కవిటి మండలం

ముందు శాంపిల్‌ తీసుకెళతాం 
చిక్కాఫ్‌ రైతు సంఘంలో కొంతమంది రైతులు తమ సొంత చెట్లలో పంట కోసి మ్యాక్సివ్యాన్‌లో లోడ్‌ చేసి ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు లోడు తీసుకువెళ్తుంటారు. అక్కడ ఒప్పందం కుదిరితే మరికొన్ని లోడులు వెళ్తాయి. 
- ఆరంగి శివాజీ, చిక్కాఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, కవిటి మండలం

మరిన్ని వార్తలు