ఆమె ఒంటరి,జ్ఞాపకాలు తప్ప మనుషులు తోడు లేరు.. చివరికి..

15 Sep, 2021 15:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పలాస(శ్రీకాకుళం): ఆమె ఒంటరి. జ్ఞాపకాలు తప్ప మనుషులు తోడు లేని మహిళ. కట్టుకున్న భర్త కాలం చేసిన నాటి నుంచి కన్నబిడ్డలను కష్టపడి పెంచింది. కొడుకు చేతికి అందివచ్చాడని సంతోషించే లోపు విధి అతడిని తీసుకెళ్లిపోయింది. కుమార్తె కూడా పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోయింది. సొంత ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. నా అనే వారు లేక, అద్దె ఇంటిలో కాలం గడిపిన బత్తిన ఆదిలక్ష్మి (70) మంగళవారం కాలం చేశారు.

ఇన్నాళ్లుగా ఆమెను చూస్తున్న స్థానికులు ఆదిలక్ష్మి మృతితో కన్నీరు పెట్టుకున్నారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన బత్తిన ఆదిలక్ష్మి(70) మంగళవారం మృతి చెందారు. ఆమె భర్త చాలా కాలం కిందటే చనిపోయారు. పదేళ్ల కిందట కొడుకు కూడా మరణించాడు. ఒక్కగానొక్క కుమార్తె సుమిత్ర వజ్రపుకొత్తూరులో తన భర్తతో కలసి ఉంటున్నారు. కొద్దికాలంగా ఆదిలక్ష్మి ఆరోగ్య స్థితి బాగోలేదు.

ఇటీవల కుమార్తె వద్ద కూడా ఆమె తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం కుమార్తె తల్లి వద్దకు వచ్చే సరికి ఆదిలక్ష్మి ఇంటిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే ఆమె పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చనిపోయారు. దీంతో ఆమె తాను ఉంటున్న వజ్రపుకొత్తూరుకు తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మృతితో బొడ్డపాడు గ్రామమంతా విషాదఛాయలు అలముకున్నాయి.   

దుష్ప్రచారం తగదు.. 
పింఛన్‌ అందకపోవడం వల్లే వృద్ధురాలు బత్తిన ఆదిలక్ష్మి మరణించిందని సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పలాస ఎంపీడీఓ ఎన్‌.రమేష్‌నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలపై విష ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.    

చదవండి: వైరల్‌: ‘లారీకి దెయ్యం పట్టిందా? రెండుగా విడిపోయినా ఏంటా పరుగు’

మరిన్ని వార్తలు