ఒమెన్‌లో చిక్కుకున్న సిక్కోలు యువకులు.. మంచి జీతాలు వస్తాయని నమ్మించడంతో

19 Aug, 2022 18:30 IST|Sakshi
తమను కాపాడాలని కోరుతున్న ఒమెన్‌లో చిక్కుకున్న యువకులు

తిండితిప్పలు లేక అల్లాడుతున్న వైనం

సాయం చేయమని వేడుకోలు

వజ్రపుకొత్తూరు రూరల్‌/కంచిలి/సంతబొమ్మాళి: దేశం కాని దేశంలో సిక్కోలు యువకులు దీనస్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు. జిల్లాలో సంతబొమ్మాళి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, మందస మండలాలకు చెందిన 8 మంది యువకులు ఒమెన్‌ దేశంలో చిక్కుకుపోయారు. ఈ మేరకు ఇక్కడి వారితో సంప్రదించి తమ బాధలు చెప్పుకున్నారు. వీరు ఈ ఏడాది మేలో విశాఖపట్నంలోని కార్తికేయ కన్సల్టెంట్‌ కంపెనీ ద్వారా ఒమెన్‌ దేశం వెళ్లారు.

రెండేళ్ల పాటు వెల్డింగ్‌ పనులు ఉంటాయని చెప్పారని, మంచి జీతాలు వస్తాయని నమ్మించడంతో ఒక్కొక్కరం రూ. 90 వేలు నుంచి రూ.లక్ష వరకు చెల్లించామని తెలిపారు. తీరా చూస్తే దళారులు చెప్పిన కంపెనీ ఆ దేశంలోనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఒంటెలకు కాపలా కాస్తూ రోజులు గడుపుతున్నామని, మూడు నెలలుగా ఉపాధి లేక కడుపు నిండా తినేందుకు తిండి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమ వద్ద ఉన్న పాస్‌పోర్డు, వీసాలు నకిలీవని పోలీసులు తీసుకెళ్లారని, భారత రాయబారి కార్యాలయానికి సంప్రదించేందుకు అవకాశం లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు.

ఒమెన్‌లో చిక్కుకున్న వారిలో వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన తామాడ కృష్ణారావు(తోటపల్లి), కీలు మాణిక్యరావు(తేరపల్లి), కర్ని లోకనాథం (గోపీనాథపురం), కంచిలి మండలానికి చెందిన పి.రవికుమార్‌ (పెద్దపాలేరు), గున్నా గోపాల్‌(పెద్దపాలేరు), సోంపేట మండలానికి చెందిన సీల వాసుదేవరావు (బి.రామచంద్రపురం), సంతబొమ్మాళి మండలానికి చెందిన కల్గి నాయుడు (గోవిందపురం), మందస మండలానికి చెందిన తలగాన నీలకంఠం (బాలాజీపురం)లు ఉన్నారు. 

మరిన్ని వార్తలు