అమెరికాలో చదువుకు శ్రీకాకుళం విద్యార్థులు ఎంపిక

3 Jan, 2021 05:24 IST|Sakshi
మౌనిక, హేమ శ్రీ

సీసీఐ ప్రోగ్రాంనకు ఎంపికైన ఇద్దరు విద్యార్థినులు

రాజాం: అమెరికా విదేశాంగశాఖ స్పాన్సర్‌ చేసే కమ్యూనిటీ కాలేజ్‌ ఇనిషియేటివ్‌ ప్రొగ్రాం (సీసీఐపీ)నకు శ్రీకాకుళం విద్యార్థినులు ఇద్దరు ఎంపికయ్యారు. రాజాంలోని జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న జీసీఎస్‌ఆర్‌ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బెహరా మౌనిక, సోపేటి హేమశ్రీ ఈ ప్రొగ్రామ్‌కి ఎంపికయ్యారు. వీరు అమెరికాలో తమకు నచ్చిన కోర్సులు అభ్యసించే అవకాశాన్ని పొందారు. వీరిని హైదరాబాద్‌ యూఎస్‌ కాన్సులేట్‌ ఎంపిక చేసింది. అమెరికా విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో సీసీఐసీ కింద వివిధ దేశాలకు చెందిన అర్హులను ఎంపిక చేసి.. ఏదైనా ఒక అమెరికన్‌ కమ్యూనిటీ కాలేజీలో ఏడాది చదువుకునే అవకాశం కల్పిస్తారు. వీరి చదువుకయ్యే ఖర్చులు, వసతి సదుపాయం, ఇతర ప్రయాణ ఖర్చులు అమెరికాయే భరించడంతోపాటు నెలవారీ స్టయిఫండ్‌ కూడా చెల్లిస్తుంది. ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న వారికి జీఎంఆర్‌ వీఎఫ్‌ ఉచితంగా శిక్షణ ఇస్తుంది. ఈ విధంగానే మౌనిక, హేమశ్రీ శిక్షణ పొందారు.   

పేద కుటుంబానికి చెందిన విద్యార్థి మౌనిక..
మౌనిక నిరుపేద మత్స్యకార కుటుంబానికి చెందిన విద్యార్థిని. జీఎంఆర్‌ వీఎఫ్‌ గిఫ్టెడ్‌ చిల్ర్డన్‌ కోటాలో ఆమె ఉచితంగా జీసీఎస్‌ఆర్‌లో చదువుతోంది. ఎన్విరాన్‌మెంటల్‌ హార్టికల్చర్‌ కోర్సును ఎంపిక చేసుకున్న మౌనిక ఇల్లినాయిస్‌ స్టేట్‌లో ఉన్న కాలేజ్‌ ఆఫ్‌ డూపేజ్‌లో చదువుకోనుంది. విజయనగరం జిల్లాకు చెందిన హేమ తండ్రి బ్యాంకులో మెసెంజర్‌గా పనిచేస్తున్నారు.  హేమశ్రీ సస్టెయినబుల్‌ అగ్రికల్చర్‌ కోర్సును ఎంచుకుంది. ఫ్లోరిడా స్టేట్‌ ఓర్లాండ్‌లో వాలెన్సియా కాలేజీలో చదవనుంది.  

మరిన్ని వార్తలు