విహారంలో విషాదం.. అంత వరకు ఉన్న ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది!

12 Jun, 2022 08:36 IST|Sakshi

సముద్ర స్నానానికి వెళ్లి తండ్రి, కూతురు, మేనకోడలు గల్లంతు

పోతయ్యపట తీరంలో ఘటన

రణస్థలం(శ్రీకాకుళం): విహారం విషాదంగా మారింది. సరదాగా సముద్ర స్నానానికి వెళితే ప్రాణాలమీదకు వచ్చింది. మండలంలోని ఎన్‌జీఆర్‌పురం పంచాయతీలో గల పోతయ్యపేటలో సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. జేఆర్‌ పురం పోలీసులు, స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కొవ్వాడ పంచాయతీలో గల రామచంద్రపురం గ్రామానికి చెందిన గాదం పాపాయమ్మ, గాదం కృష్ణ ఇంటికి వారి అల్లుడు తిరుపతి గణేష్‌ తన భార్య ఈశ్వరమ్మతో కలిసి ఇద్దరు పిల్లలతో రెండు వారాల కిందట వచ్చారు. ఈయన స్వగ్రామం విశాఖలోని భీమిలి.

భార్యా పిల్లలను కొవ్వాడలోనే వదిలేసి గణేష్‌ మరుసటి రోజు వైజాగ్‌ వెళ్లిపోయారు. మళ్లీ శనివారం ఉదయం ఆయన తన మేనకోడలు దీవెనతో కలిసి రామచంద్రపురం వచ్చారు. సాయంత్రం ఏడుగురు కుటుంబ సభ్యులు పోతయ్యపేటలోని సముద్ర తీరానికి సరదాగా వెళ్లారు. అంతా కాసేపు ఉల్లాసంగా గడిపారు. ఒడ్డుకు చేరుకుంటున్న సమయంలో తిరుపతి గణేష్‌(32), తిరుపతి మానస (9), మేనకోడలు వానమామల దీవెన (18)లు ఒక్కసారిగా గల్లంతయ్యారు. దీంతో ఒడ్డున ఉన్న వారంతా గగ్గోలు పెట్టారు. స్థానిక మత్స్యకారులకు సమాచారం ఇవ్వగా.. వారు పడవలపై సముద్రంలోకి వెళ్లారు. వలలు వేసి గల్లంతైన వారి కోసం వెతికినా లాభం లేకపోయింది. గల్లంతైన వారిలో భీమిలి మండలంలోని కాపులుప్పాడ సమీపంలోని నగరప్పాలెం గ్రామం. ఆయన మేనకోడలు దీవెనది విశాఖపట్నం జిల్లా చోడవరం మండలంలో గల వడ్డాది గ్రామం. జేఆర్‌ పురం ఎస్‌ఐ జి.రాజేష్‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

చదవండి: Jagananna Thodu: చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. ఏపీ సర్కార్‌ కీలక ఆదేశాలు.. 


 

మరిన్ని వార్తలు