స్థలమిస్తారా.. చావమంటారా

6 Aug, 2021 09:17 IST|Sakshi

స్థల వివాదంలో మహిళ ఆత్మహత్యాయత్నం  

సాక్షి, టెక్కలి రూరల్‌( శ్రీకాకుళం): మేజర్‌ పంచాయతీ టెక్కలిలోని ఆది ఆంధ్ర వీధిలో స్థల వివాదానికి సంబంధించి తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ మహిళ బెదిరించింది. పోలీసులు సకాలంలో స్పందించి సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిఆంధ్ర వీధికి చెందిన బసవల దాలమ్మకు చెందిన స్థలాన్ని ఆమె పెద్ద కుమారుడు బసవల నూకరాజు.. రౌతు లక్ష్మి అనే మహిళ పేరిట రిజిస్ట్రేషన్‌ చేశాడు.

అయితే ఇప్పుడా స్థలం తనదని, సంబంధిత పత్రాలు కూడా ఉన్నాయని దాలమ్మ మనవడు గోవింద్‌ చెప్పడంతో లక్ష్మి గురువారం ఆందోళనకు దిగింది. స్థలం తనకు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ కిరోసిన్‌ క్యాన్‌తో బెదిరించడంతో విషయం తెలుసుకున్న టెక్కలి ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు ఘటన స్థలానికి చేరుకున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం స్థలం కేటాయిస్తామని సర్దిచెప్పారు. ఈ సమయంలోనే రౌతు లక్ష్మి వర్గానికి చెందిన కొంతమంది తనపై దాడి చేశారని గోవింద్‌ ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు