ఊరంతా ఖాళీ అయ్యింది. ఇంటింటికీ తాళం పడింది

19 Jan, 2021 08:45 IST|Sakshi
గొర్రె పిల్లలను కూడా వెంట పెట్టుకుని గ్రామం వదిలిపోతున్న శ్రీమజ్జనపల్లి వాసులు

 శ్రీమజ్జనపల్లి గ్రామం చుట్టూ ముళ్లకంచె

ఊళ్లోకి ఎవరూ ప్రవేశించకుండా పటిష్ట కాపలా

పిల్లాపాపలు, పెంపుడు జంతువుల సహా ఆరుబయటే

ఆ ఊరంతా ఖాళీ అయ్యింది. ఇంటింటికీ తాళం పడింది. జనసమ్మర్ధంతో ఉండే ఊరు నిర్మానుష్యంగా మారింది. ఒక్కసారిగా ఊళ్లో నిశ్శబ్దం. ఇదేదో కరోనా మహమ్మరి బారిన పడి ఇలా చేశారనుకుంటే పొరబడినట్లే. దశాబ్దాలుగా పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ వస్తున్న గ్రామీణులు తమ ఊరు బాగుకోసం గ్రామదేవతలను వేడుకుంటూ గ్రామం వదిలి వనంబాట పట్టారు. గ్రామ శివారులోని పొలాలు, అడవుల్లోకి వెళ్లి చెట్ల కింద గుడారాలు వేసుకుని, అక్కడే వంటావార్పు చేసుకున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం శ్రీమజ్జనపల్లిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.  

సాక్షి, కుందురీప(అనంతపురం‌) : పూర్వీకుల ఆచారాన్ని పాటించడంలో భాగంగా కుందుర్పి మండలం శ్రీమజ్జనపల్లి గ్రామం సోమవారం పూర్తిగా ఖాళీ అయింది. గ్రామం చుట్టూ ముళ్లకంచె వేసి సోమవారం మధ్యాహ్నం 12 నుంచి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామస్తులు ఊరు వదిలి వెళ్లారు. చదవండి: ప్యాంట్‌ కోసం రచ్చ.. మీకెలా కనబడుతున్నాం?

దేవుడి ప్రతిమలతో పాటు..  
ఆచారంలో భాగంగా గ్రామంలోని నాలుగు ప్రధాన ఆలయాల్లోని దేవుడి ప్రతిమలతో పాటు పెంచుకున్న మూగజీవాలు, కుక్కలు, పిల్లులను కూడా శ్రీమజ్జనపల్లి వాసులు తమ వెంట తీసుకుని, గ్రామం వదిలి అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. కర్ణాటక సరిహద్దున ఉన్న ఈ గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన 280 కుటుంబాలు ఉన్నాయి. 1,120 జనాభా ఉన్న శ్రీమజ్జనపల్లిలో నేటికీ 90 శాతం పూర్వపు ఆచారాలనే అనుసరిస్తూ వస్తున్నారు.


ఊరు వదిలి వెళ్తున్న గ్రామస్తులు   

రోగాలు నయమవుతాయని
శ్రీమజ్జనపల్లి వాసులు పాటిస్తున్న ఈ ఆచారం వెనుక సుదీర్ఘ కథనమే ఉంది. గ్రామ పెద్దలు తెలిపిన మేరకు ‘వందేళ్ల క్రితం గ్రామంలో అతిసార సోకి పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. ఆ సమయంలో గ్రామ దేవతలు పాలనాయక, పెద్దక్క రాయమ్మ అమ్మవారు అప్పట్లో అర్చకులుగా ఉన్న పుజారి పాలయ్య, ఓబయ్య, హనుమయ్య  కలలో కనిపించి 24 గంటల పాటు అందరూ గ్రామాన్ని వదిలి వెళితే ఊరు సుభిక్షంగా ఉంటుందని తెలిపింది. అప్పటి నుంచి గ్రామస్తులు ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. ప్రతి మూడు లేదా ఐదేళ్లకు ఓసారి ఇలా పూరీ్వకుల ఆచారాన్ని పాటించడం ఆనవాయితీగా మారింది’.  

24 గంటలు గ్రామంలోకి ‘నో ఎంట్రీ’..
గ్రామం వదిలిన తర్వాత 24 గంటల పాటు ఆ ఊళ్లోకి ఎవరినీ అనుమతించకుండా చుట్టూ ముళ్ల కంచె వేశారు. స్థానికులతో పాటు ఇతర గ్రామాల ప్రజలు సైతం గ్రామంలోకి వెళ్లకుండా ఊరు చుట్టూ 30 మంది యువకులు కాపలా కాశారు. ఈ నిబంధన అతిక్రమించి, పొరబాటున ఎవరైనా గ్రామంలోకి కాలుపెడితే.. కాసిపుల్లతో నాలుకపై కాలుస్తారు.  గ్రామాన్ని ఖాళీ చేసే ముందు వింత ఆచారాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామ శాంతి కోసం జంతు బలులు సమర్పించి పది బస్తాల బియ్యాన్ని వండి పసుపు కుంకుమతో కలిపి గ్రామం చుట్టూ చల్లుతారు. అనంతరం ఏకమొత్తంగా రెండు పూటలకు సరిపడు బియ్యం, బేడలు, కాయగూరలు, పాత్రలు తీసుకుని గ్రామం వదిలి వెళ్లిపోతారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గ్రామాన్ని ఖాళీ చేసిన శ్రీమజ్జనపల్లి వాసులు.. తిరిగి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇళ్లకు చేరుకుంటారు. ఇళ్లను శుద్ధి చేసిన అనంతరం లోపలకు ప్రవేశిస్తారు.

  
గ్రామం చుట్టూ వేసిన ముళ్లకంచె

80 శాతం నిరక్ష్యరాశ్యులే.. 
శ్రీమజ్జనపల్లి గ్రామంలో 80 శాతం మంది నిరక్ష్యరాశ్యులే ఉన్నారు. మూఢాచారాలను పాటిస్తూ చిన్న పిల్లలకే పెళ్లిళ్లు చేసేస్తుంటారు. ఏటా పది నుంచి 15 బాల్యవివాహాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ గ్రామస్తులకు దైవభక్తి ఎక్కువే. గోపూజతో దినచర్య ప్రారంభిస్తారు. కోళ్లను పెంచరు. కోడి మాంసం తినరు.  ఏటా జనవరిలో నరసింహస్వామి గ్రామోత్సవం, శివరాత్రి పర్వదినాల్లో పాలనాయకస్వామి జాతర్లు వైభవంగా నిర్వహిస్తుంటారు. రూ. కోటి విరాళాలతో గ్రామంలో పాలనాయక స్వామి ఆలయ నిర్మాణాన్ని ఇటీవల చేపట్టారు.  

మరిన్ని వార్తలు