పేదల ఇళ్ల కోసం 30 వేల ఎకరాలు: శ్రీరంగనాథరాజు

29 Jul, 2021 16:01 IST|Sakshi

కొత్తగా 17,005 కొత్త కాలనీలు నిర్మిస్తున్నాం

30 లక్షల మంది పేదలకు ఉచితంగా ఇసుక

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు

ఇళ్ల నిర్మాణంపై విప్‌లు, ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశం

సాక్షి, అమరావతి: పేదల కోసం సీఎం రూ.12 వేల కోట్లతో ఇళ్ల పట్టాల కోసం భూములు సేకరించామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. ఇళ్ళ నిర్మాణంపై విప్‌లు, ఎమ్మెల్యేలతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ, 30 వేల ఎకరాలు పేదల ఇళ్ల కోసం సేకరించామని పేర్కొన్నారు. ప్రస్తుతం లే అవుట్‌లుగా అభివృద్ధి చేసి మొత్తం సదుపాయాలు కల్పిస్తున్నామని, పేదలకు మంచి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిపారు.

30 లక్షల మంది పేదలకు ఉచితంగా ఇసుక ఇస్తున్నాం. సిమెంట్‌, ఐరన్‌, మెటల్‌ను తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. లక్షా 80 వేల ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వ సహకారాన్ని అందిస్తున్నాం. ఎమ్మెల్యేలతో చర్చించి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకున్నాం. వాటన్నింటిని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని’’ శ్రీరంగనాథరాజు తెలిపారు.

మొదటగా లే అవుట్లకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. లబ్దిదారులకు నచ్చినట్లు ఇల్లు కట్టుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గతలో 240 చదరపు అడుగులు ఇచ్చేవారు.. ఇప్పుడు 340 చ.అడుగులు ఇస్తున్నామని వివరించారు. లబ్దిదారుల ప్రాధాన్యత ఆధారంగా నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. రూ.32 వేల కోట్లతో శాశ్వత డ్రైనేజీ, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామని, కొత్తగా 17,005 కొత్త కాలనీలు నిర్మిస్తున్నామని మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు