శాంతించిన గోదావరి

20 Aug, 2020 04:02 IST|Sakshi
బుధవారం సాయంత్రం శ్రీశైలం డ్యాం మూడు క్రస్ట్‌ గేట్ల నుంచి నాగార్జున సాగర్‌కు విడుదలవుతున్న నీరు

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌: కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పోటెత్తింది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రాజెక్టులోకి 3.69 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 881.30 అడుగుల్లో 195.21 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి భారీ ఎత్తున వరదను విడుదల చేసిన నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 79,131 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 71,321 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో నాగార్జునసాగర్‌లోకి 1.50 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 260.59 టీఎంసీలకు చేరింది. సాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న నీటికి మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 18,989 క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో పులిచింతలలో నీటి నిల్వ 14.98 టీఎంసీలకు చేరింది. 

► ఎగువ నుంచి భారీ ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో మరో మూడు రోజుల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండనున్నాయి.
► పులిచింతలకు దిగువన నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వైరా, కట్టలేరు, మున్నేరుల్లో వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద తగ్గింది. బుధవారం ఆరు గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 68,522 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు వదలగా మిగులుగా ఉన్న 48,754 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 

శాంతించిన గోదావరి
గత నాలుగు రోజులుగా మహోగ్రరూపం దాల్చిన గోదావరి శాంతించింది. పరీవాహక ప్రాంతంలో వర్షాలు, ఉపనదుల్లో వరద ప్రవాహం తగ్గడంతో వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. బుధవారం రాత్రి ఏడు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తి 18.56 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీ వద్ద 17.40 అడుగుల నీటిమట్టం ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గురువారం ఉదయానికి వరద ప్రవాహం మరింత తగ్గుతుందని.. ధవళేశ్వరంలో నీటిమట్టం 13.75 అడుగుల కంటే దిగువకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అప్పుడు రెండో ప్రమాద హెచ్చరికను, ఇంకా తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుంటామని వెల్లడించారు.
 
– మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి బుధవారం ఉదయం ఆరు గంటల వరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 190.79 టీఎంసీలు (ఈ నీటితో పోలవరం ప్రాజెక్టు ఒకే రోజులో నిండిపోతుంది) కడలిపాలయ్యాయి.
– పోలవరం వద్ద కూడా గోదావరి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 
– పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పర్యటించి బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించారు. 
– ఏజెన్సీలోని 19 గిరిజన గ్రామాలు జలదిగ్భంధంలోనే కొనసాగుతున్నాయి. నిర్వాసితులకు టూరిజం బోట్ల ద్వారా నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. 
– అమావాస్య ప్రభావంతో.. సముద్రపు పోటుతో నర్సాపురంలో వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. పట్టణ పరిధిలో గోదావరి గట్టును ఆనుకుని ఉన్న పొన్నపల్లి, మాధవాయిపాలెం ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది.
– తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని నాలుగు విలీన మండలాల్లో సహాయ చర్యలను ముమ్మరం చేశారు.    
 – విలీన మండలాల్లో ముంపులో ఉన్న లోతట్టు గ్రామాల్లో అధికారులు లాంచీలు, బోట్ల ద్వారా నిత్యావసర సరుకులను అందిస్తున్నారు.
– చింతూరు మండలంలో చట్టి చిదుమూరు, కుయిగూరు వద్ద జాతీయ రహదారిపై నీరు ఉండడంతో ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు రాకపోకలు పునరుద్ధరణ కాలేదు. దేవీపట్నంలో ఇళ్లన్నీ ముంపులోనే ఉన్నాయి. 
– కోనసీమలోని లంక గ్రామాలు ముంపు నుంచి బయటపడలేదు. మలికిపురం మండలం దిండిలో వశిష్ట గోదావరి ఏటి గట్టు లీకవ్వగా వెంటనే హెడ్‌ వర్క్స్‌ అధికారులు లీకేజీని అరికట్టారు. 
– కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పడవపై వెళ్లి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. పి.గన్నవరం నియోజకవర్గంలో ఎంపీ చింతా అనూరాధ ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.  

మరిన్ని వార్తలు