883.20 అడుగులకు చేరుకున్న శ్రీశైలం జలాశయం

4 Oct, 2021 04:57 IST|Sakshi
సాగర్‌ 2 క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

శ్రీశైలం ప్రాజెక్ట్‌/సత్రశాల/విజయపురిసౌత్‌: ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరదనీరు వస్తున్నప్పటికీ అంతే మొత్తంలో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలం డ్యాం నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 71,484 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వస్తుండగా, కుడి, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రాలలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 66,365 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్‌ నీటిమట్టం 883.20 అడుగులకు చేరుకుంది. అలాగే, నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌లో 2 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం 589.70 అడుగులు ఉంది. ఇది 311.1486 టీఎంసీలకు సమానం. కాగా, నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌ నుంచి 44,886 క్యూసెక్కుల నీరును దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తూ 42 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్ట్‌ డీఈ దాసరి రామకృష్ణా, ఏడీఈ నర్సింహారావు ఆదివారం తెలిపారు.  

మరిన్ని వార్తలు