శాస్త్రోక్తంగా చక్రధారుడి చక్రస్నానం

27 Sep, 2020 11:19 IST|Sakshi

సాయంత్రం ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

సాక్షి, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆది‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య శ్రీ‌వారి ఆల‌యంలోని ‘అయినా మ‌హ‌ల్’ ముఖ మండ‌పంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం శాస్త్రో‌క్తంగా నిర్వహించారు. అనంత‌రం ‘అయినా మ‌హ‌ల్’ ముఖ మండ‌పం ప్రాంగ‌ణంలో ప్ర‌త్యేకంగా నిర్మించిన చిన్న పుష్క‌రిణిలో ఉద‌యం 8.15 గంట‌ల‌కు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీ జలంలో ముంచి స్నానం చేయించారు. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూప దీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభ ధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశ శాంతి మంత్రములు, పురుష సూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను పారాయణం  చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను పెద్ద జీయ్యంగార్‌, చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

చక్రస్నానం - లోకం క్షేమం..
తొమ్మిది రోజుల ఉత్సవాల్లో జరిగిన అన్ని సేవలూ సఫలమై - లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ - చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృథస్నానం' చేస్తారు. యజ్ఞ నిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంత స్నానం అవభృథం. చక్రస్నానం నాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవయజ్ఞం మంగళాంతం అవుతుంది. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాప విముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. విష మృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారు. పరాంతకాలం వరకూ ఎటువంటి జనన, మరణ వికారములు లేకుండా సర్వలోకాలలో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకొంటారు. 

అనంతరం రాత్రి ఎనిమిది గంటల నుంచి నుండి తొమ్మిది గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి. ఈ కార్యక్రమాల్లో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శేఖ‌ర్ ‌రెడ్డి, డా.నిశ్చిత‌, శివ‌కుమార్‌, డీపీ అనంత, అర్బ‌న్ ఎస్పీ ర‌మేష్‌రెడ్డి, సిఇ ర‌మేష్‌ రెడ్డి పాల్గొన్నారు.

వైభవంగా బ్రహ్మోత్సవాలు: వైవీ సుబ్బారెడ్డి  
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఏకాంతంగా నిర్వహించామని తెలిపారు. కోవిడ్ కారణంగా ఈసారి ఏకాంతంగా నిర్వహించినా, ఎక్కడ లోపం లేకుండా వైభవంగా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. చక్రస్నానం ఏకాంతంగానే నిర్వహించామని చెప్పారు. సాయంత్రం ధ్వజాఅవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా