కొత్త నమూనాలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు 

19 Feb, 2021 08:07 IST|Sakshi

పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను కొత్త నమూనాలో నిర్వహించనున్నారు. కోవిడ్‌ వల్ల విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను 11 పేపర్లకు బదులు 7 పేపర్లకు కుదించిన సంగతి తెలిసిందే. ఫస్ట్‌ లాంగ్వేజ్, సెకండ్‌ లాంగ్వేజ్, ఇంగ్లిష్‌, మేథమెటిక్స్, సోషల్‌ స్టడీస్‌ పేపర్లను 100 మార్కులకు, ఫిజికల్‌ సైన్సు, బయోలజీ పేపర్లను 50 మార్కులకు వేర్వేరుగా నిర్వహించనున్నారు.

ఇంతకు ముందు సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో ఒక్కోసబ్జెక్ట్‌లో 80 మార్కులకు పబ్లిక్‌ పరీక్షలను నిర్వహించి, మిగిలిన 20 మార్కులను అంతర్గత (ఇంటర్నల్‌) మార్కుల నుంచి తీసుకొని కలిపేవారు. 2021 మార్చి పరీక్షలకు ఈ విధానాన్ని రద్దు చేసి, పూర్తిగా 100 మార్కులకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ మేరకు ప్రశ్నపత్రం నమూనాలో స్వల్ప మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ గురువారం జీవో విడుదల చేసింది. దీని ప్రకారం ప్రశ్నపత్రాల్లో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు, అతి స్వల్ప సమాధానాల ప్రశ్నలు, స్వల్ప సమాధానాల ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలను అడగనున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు విద్యార్థులకు 2.30 గంటల సమయం కేటాయిస్తున్నారు. ప్రశ్నపత్రం చదివేందుకు 15 నిమిషాల పాటు అదనపు సమయం ఇస్తారు.

చదవండి: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల నిర్మాణం 
కూలిన ‘దేశం’ కంచు కోటలు

మరిన్ని వార్తలు