CM YS Jagan: సచివాలయాల ఉద్యోగుల కుటుంబాలపై సీఎం జగన్‌ ‘కారుణ్యం’

2 Oct, 2022 04:55 IST|Sakshi

ప్రొబేషన్‌కు ముందు చనిపోయిన సచివాలయాల ఉద్యోగుల కుటుంబాలకూ కారుణ్య నియామకం

ఫైలుపై సంతకం చేసిన ముఖ్యమంత్రి

కరోనా సమయంలో చేసిన సేవలకు గుర్తింపు

సర్వీస్‌ నిబంధనలను సడలించి, ఆ కుటుంబాలకు మేలు

కృతజ్ఞతలు తెలిపిన సచివాలయాల ఉద్యోగుల సంఘం

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ఉదార నిర్ణయం తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో ఎవరైనా ప్రొబేషన్‌ ఖరారుకు ముందే చనిపోయి ఉంటే, వారి కుటుంబీకులకు కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించేందుకు ఆమోద ముద్ర వేశారు. సర్వీస్‌ నిబంధనల ప్రకారం ప్రొబేషన్‌ ఖరారుకు ముందు చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల్లో అవకాశం ఉండదు.

అయితే 2019 అక్టోబరులో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిలో దాదాపు 200 మంది చనిపోయారు. అందులో అత్యధికులు కరోనా సమయంలో మరణించారు. కరోనా సమయంలో వలంటీర్లతో పాటు  సచివాలయాల ఉద్యోగుల ప్రత్యేక సేవలకు గుర్తింపుగా ప్రత్యేక పరిస్థితుల్లో మృతుల కుటుంబాలకు కూడా కారుణ్య నియామకాల్లో వీలు కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు. దానికి సంబంధించిన  ఫైలుపై సంతకం చేశారు.

గొప్ప మనస్సు ఉన్న సీఎం..
సర్వీస్‌ నిబంధనలను సడలించి ప్రొబేషన్‌ ఖరారుకు ముందు చనిపోయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గొప్ప మనస్సుకు అద్దం పడుతుందని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఒక ప్రకటనలో కొనియాడింది.

మానవతా దృక్పథంతో ఆలోచించి చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్‌కు సచివాలయాల ఉద్యోగులందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు గౌరవాధ్యక్షులు కాకర్ల వెంకటరామిరెడ్డి, అధ్యక్షుడు భీంరెడ్డి అంజన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, కార్యనిర్వాహక అధ్యక్షులు విప్పర్తి నిఖిల్‌కృష్ణ, భార్గవ్‌ తేజ్, ఉపాధ్యక్షుడు బీఆర్‌ఆర్‌ కిషోర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు