కడప స్టీల్‌ ప్లాంట్‌ భూములకు స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు

7 Jul, 2021 05:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం వైఎస్సార్‌ జిల్లాలో ఏర్పాటు చేస్తోన్న వైఎస్సార్‌ స్టీల్‌ ప్లాంట్‌ (వైఎస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) కోసం కేటాయించిన 3,148.68 ఎకరాలకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్వర్వులిచ్చింది. జిల్లాలోని జమ్మలమడుగు మండలం పెద్దనందులూరు, సున్నపురాళ్లపల్లెలో ప్రభుత్వం ఈ భూమిని సేకరించింది. ఈ భూములకు సంబంధించి రూ.3.89 కోట్ల స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు కట్టాల్సి ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కించింది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేస్తోన్న స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రజత్‌ భార్గవ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

కాకినాడ సెజ్‌ భూములకూ మినహాయింపు 
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సెజ్‌లో రైతులకు తిరిగి ఇస్తున్న 2,180 ఎకరాలకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజును మినహాయిస్తూ మరో నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఆ ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు