రాసింది ఒకటి.. చేసింది మరొకటి.. ‘స్టార్‌’ డయాగ్నస్టిక్‌  సెంటర్‌ నిర్వాకం

17 Jan, 2023 07:58 IST|Sakshi

సాక్షి, అనంతపురం: నగరంలోని స్టార్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ నిర్వాహకుల తీరు రోగులను ఆవేదనకు గురి చేస్తోంది. బాధితులు తెలిపిన మేరకు... మల విసర్జన సమయంలో ఇబ్బంది పడుతున్న జమ్మలమడుగుకు చెందిన ప్రకాష్‌రెడ్డి సోమవారం ఉదయం అనంతపురంలోని తన సోదరుడి కుమారుడు హరిప్రసాదరెడ్డితో కలసి ఓ ప్రైవేట్‌ ఆసపత్రికి వెళ్లి చూపించుకున్నాడు.

ఆ సమయంలో ఇద్దరికీ ఎంఆర్‌ఐ పిస్టులాగ్రామ్‌ లిమిట్‌ కట్స్‌ వైద్య పరీక్ష చేయించుకుని రావాలంటూ స్టార్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు డాక్టర్‌ ప్రణీత్‌రెడ్డి రెఫర్‌ చేశారు. దీంతో వారు స్టార్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో పేషెంట్‌ ఐడీ నెంః 230116–026(హరిప్రసాద్‌రెడ్డి), 230116–025(ప్రకాష్‌రెడ్డి)తో పరీక్ష చేయించుకున్నారు. ఇందుకుగాను ఇద్దరికీ కలిపి రూ.14 వేలు బిల్లు అయింది. అనంతరం రిపోర్టు తీసుకెళ్లి వైద్యుడికి చూపిస్తూ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో ఒక్కొక్కరికి రూ.7వేలు చొప్పున బిల్లు అయిందంటూ వివరించారు. దీంతో డాక్టర్‌ అసహనానికి గురవుతూ తాను రాసిచ్చిన పరీక్షలకు సంబంధించి ఒక్కొక్కరికి రూ.3,500 మాత్రమే అవుతుందని, రూ.7 వేలు చొప్పున ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నించాడు.

ఇదే విషయాన్ని డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు వెళ్లి బాధితులు ప్రశ్నిస్తే అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి పంపారు. డయాగ్నస్టిక్‌ సెంటర్‌ నిర్వాహకులు తమను మోసం చేశారంటూ ఈ సందర్భంగా బాధిత రోగులు వాపోయారు. దీనిపై స్టార్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ నిర్వాహకుల్లో ఒకరైన దాదాగాంధీ మాట్లాడుతూ.. డాక్టర్‌ సూచన మేరకు తాము వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.    

హరిప్రసాద్‌ రెడ్డికి వైద్యుడు రాసిచ్చిన టెస్టు చీటి  

మరిన్ని వార్తలు