4,755 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీ.. కౌన్సెలింగ్‌ ప్రారంభం

17 May, 2022 03:28 IST|Sakshi

4,755 పోస్టుల నియామకం చేపట్టిన వైద్య శాఖ  

జోన్లను బట్టి 19వ తేదీ వరకు కౌన్సెలింగ్‌  

కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక అభ్యర్థులకు పోస్టింగ్‌లు 

గతేడాది 3,393 పోస్టుల భర్తీ  

సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) నియామకాలకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జోన్లలో కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. ఇప్పటికే గతేడాది నవంబర్‌లో 3,393 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసి నియామక ప్రక్రియ కూడా పూర్తి చేశారు. తాజాగా వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో సేవలు అందించడానికి 4,755 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీకి గత నెలలో వైద్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

జోన్ల వారీగా విశాఖపట్నం 974, రాజమండ్రి 1,446, గుంటూరు 967, కడప 1,368 పోస్టులు భర్తీ చేస్తున్నారు. విశాఖపట్నం జోన్‌లో ఈ నెల 18 వరకు, రాజమండ్రి, కడప జోన్‌లలో 19 వరకు కౌన్సెలింగ్‌ ఉంటుంది. గుంటూరులో మంగళవారం (నేడు)తో కౌన్సెలింగ్‌ ముగియనుంది. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.

గ్రామీణ ప్రజలు చిన్న చిన్న జబ్బులకు వైద్యం కోసం కి.మీ. కొద్దీ ప్రయాణించి పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు వెళ్లే పనిలేకుండా రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీటిలో సేవలు అందించడానికి బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్హత కలిగిన వారిని ఎంఎల్‌హెచ్‌పీలుగా నియమిస్తోంది. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ద్వారా 12 రకాల వైద్య సేవలను అందిస్తోంది. అదేవిధంగా టెలిమెడిసిన్‌ సేవలను కూడా గ్రామీణ ప్రజలకు చేరువ చేసింది.      

మరిన్ని వార్తలు