సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం

14 Jun, 2021 11:57 IST|Sakshi

వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించిన సీఎం

మొత్తం రూ.2,83,380 కోట్ల రుణ ప్రణాళిక

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన 215వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం సోమవారం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవెన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్‌ అరుణ్‌కుమార్‌, సెర్ప్ సీఈవో, పి.రాజాబాబు, ఎస్‌ఎల్‌బీసీ, ఏపీ, కన్వీనర్‌ వి బ్రహ్మానందరెడ్డి, నాబార్డు సీజీఎం, సుధీర్‌ కుమార్‌ జన్నావర్‌తో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎండీ, సీఈఓ రాజ్‌ కిరణ్‌ రాయ్, ఆర్‌బీఐ జీఎం యశోధా భాయి పాల్గొన్నారు. వార్షిక రుణ ప్రణాళికను సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. మొత్తం 2.83 లక్షల కోట్లతో రుణ ప్రణాళికను రూపొందించారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, వ్యవసాయరంగానికి రూ.1.48,500 కోట్లు ఇవ్వాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టామన్నారు. రుణాల పంపిణీలో నిర్దేశించుకున్న లక్ష్యాలకన్నా అధికంగానే చేపట్టామని.. కొన్ని అంశాల్లో బ్యాంకుల సమర్థత పెరగాల్సి ఉందని సీఎం తెలిపారు.

‘‘నాడు-నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం. విలేజ్‌ క్లినిక్స్‌, టీచింగ్‌ ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. 6 కొత్త మెడికల్‌ కాలేజీలను తీసుకొస్తున్నాం. ప్రతి పార్లమెంట్‌ పరిధిలో ఒక టీచింగ్‌ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం. ఎంఎస్‌ఎంఈల కోసం రీస్టార్ట్‌, నవోదయ కార్యక్రమాలు చేపట్టాం. కోవిడ్‌ సమయంలో వాటికి చేయూతనిచ్చి నడిపించాల్సిన అవసరం ఉంది.

తొలి విడతలో 15 లక్షలకుపైగా ఇళ్లను నిర్మిస్తున్నాం. 17 వేలకుపైగా కొత్త కాలనీలను నిర్మిస్తున్నాం. కాలనీల్లో తాగునీరు, డ్రైనేజ్‌, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. వీటి కోసం సుమారు రూ.34వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మహిళా సాధికారిత కోసం అనేక చర్యలు తీసుకున్నాం. ఆసరా, చేయూత ద్వారా మహిళలను ఆదుకుంటున్నాం. అమ్మఒడి కింద నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నాం. ఈ పథకాలు మహిళా సాధికారితలో కీలకపాత్ర పోషిస్తున్నాయని’’ సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.


చదవండి: గ్రామ సర్పంచ్‌లతో మంత్రి పెద్దిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌
సాక్షి ఎఫెక్ట్‌: పల్లా ఆక్రమణలకు చెక్‌

మరిన్ని వార్తలు