తయారీ రంగానికి ‘రీస్టార్ట్‌’ కిక్‌ 

13 Nov, 2020 04:12 IST|Sakshi

ఆగస్టు నెలలో రాష్ట్ర తయారీ రంగంలో 1.2 శాతం వృద్ధి

ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 8.6 శాతం క్షీణత

ఏప్రిల్‌–ఆగస్టు కాలానికి దేశ సగటు కంటే మెరుగైన పనితీరు

ఆదుకున్న ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, మెటల్స్, కెమికల్‌ రంగాలు..

అర్థగణాంక శాఖ తాజా నివేదికలో వెల్లడి

సాక్షి, అమరావతి : లాక్‌డౌన్‌తో దెబ్బ తిన్న రాష్ట్ర పారిశ్రామికోత్పత్తి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నెలలో రీస్టార్ట్‌ పేరుతో గ్రీన్‌ జోన్‌లో ఉన్న ఫ్యాక్టరీలను ప్రారంభించడానికి అనుమతించడం సత్ఫలితాలను ఇచ్చింది. దీంతో ఐదు నెలల విరామం తర్వాత రాష్ట్ర తయారీ రంగం వృద్ధి బాట పట్టింది. ఆగస్టు నెలలో తయారీ రంగంలో 1.2 శాతం వృద్ధి నమోదైనట్లు రాష్ట్ర అర్థగణాంక శాఖ తాజాగా విడుదల చేసిన ఇండెక్స్‌ ఆఫ్‌ ఇండిస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ (ఐఐపీ) గణాంకాల్లో వెల్లడైంది.

రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 353 కర్మాగారాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా తయారీ రంగంలో వృద్ధిని అంచనా వేస్తారు. గతేడాది ఆగస్టు నెలలో 120.3 పాయింట్లు ఉన్న తయారీ రంగం ఈ ఏడాది ఆగస్టు నెలలో 121.7 పాయింట్లుగా నమోదైంది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 8.6 శాతం క్షీణత నమోదు కావడం గమనార్హం. తయారీ రంగంలో లోహాలు, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక మెషినరీ, రవాణా పరికరాలు, కెమికల్స్, అప్పరెల్స్‌ వంటి రంగాలు మంచి పనితీరు కనపరచడంతో ఆగస్టు నెలలో వృద్ధి రేటు నమోదైంది. ముఖ్యంగా క్యాపిటల్‌ గూడ్స్‌ రంగంలో 19.7 శాతం, ఇంటర్మీడియేట్‌ గూడ్స్‌ 7.0 శాతం, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ 7.1 శాతం, కన్జూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ 6.8 శాతం చొప్పున వృద్ధి నమోదైనట్లు ఐఐపీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

దేశ సగటు కంటే మెరుగైన పనితీరు..
– ఏప్రిల్‌–ఆగస్టులో రాష్ట్ర పారిశ్రామికోత్పత్తి దేశ సగటు కంటే మెరుగైన పనితీరు కనపర్చింది. కోవిడ్‌ దెబ్బతో ఆ సమయంలో దేశ వ్యాప్తంగా తయారీ రంగంలో 27.9 శాతం క్షీణత నమోదైతే అది మన రాష్ట్రంలో 15.6 శాతానికి పరిమితమైంది. 
– ఈ సమీక్షా కాలంలో ఆటోమొబైల్‌ తయారీ రంగంలో గతేడాదితో పోలిస్తే 124.2 శాతం వృద్ధి నమోదైంది. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ల తయారీలో 71.8 శాతం, ఆహార ఉత్పత్తుల తయారీలో 24.18 శాతం వృద్ధి నమోదైంది. 
– రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్‌ కింద త్వరతగతిన పరిశ్రమలు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడమే కాకుండా కష్ట సమయంలో రూ.1,168 కోట్ల రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించడంతో సత్ఫలితాలు వచ్చాయని, ఆర్థిక సంవత్సరం మొత్తం మీద తిరిగి వృద్ధి బాట పట్టగలమన్న నమ్మకాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

ముందుగా స్పందించాం..
దేశంలోనే తొలిసారిగా ‘రీస్టార్ట్‌’ ప్యాకేజీ కింద ఏప్రిల్‌ మూడో వారం నుంచే కొవిడ్‌ ఆంక్షలను పాటిస్తూ పరిశ్రమలను ప్రారంభించాం. దాంతో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్ర తయారీ రంగం వేగంగా కోలుకుంది.  వైఎస్సార్‌ నవోదయం పేరుతో ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ఆదుకున్నాం. గత ప్రభుత్వ రాయితీ బకాయిలను కోవిడ్‌ సమయంలో ఇవ్వడంతో పరిశ్రమలు త్వరగా ఉత్పత్తి ప్రారంభించగలిగాయి. దీనివల్ల ఈ ఏడాది పారిశ్రామికోత్పత్తిలో దేశ సగటు కంటే ఎక్కువ వృద్ధి రేటు నమోదు అవుతుందని అంచనా వేస్తున్నాం.
– మేకపాటి గౌతమ్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి

నాలుగు అంశాలు కలిసొచ్చాయి
సంక్షోభ సమయంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు నగదు అందజేయడంతో వారిలో కొనుగోలు శక్తి పెరిగింది. పరిశ్రమల ప్రారంభానికి పారిశ్రామిక ప్రతినిధులతో కలిసి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేసింది. ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేసి సమస్యలను పరిష్కరించింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిపుణులను అందిస్తోంది. ఈ నాలుగు అంశాలకు తోడు రాష్ట్ర వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు బాగుండటం కలిసి వచ్చింది.
– డి.రామకృష్ణ, సీఐఐ (ఏపీ చాప్టపర్‌) చైర్మన్‌  

మరిన్ని వార్తలు