సీఎఫ్‌ఎంఎస్‌ చెల్లింపుల కేసులో స్టే

29 Jun, 2022 04:57 IST|Sakshi

సీఎఫ్‌ఎంఎస్‌ చెల్లింపులు, స్వీకరణ వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు సింగిల్‌ జడ్జి

ఆ ఉత్తర్వులపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అప్పీల్‌

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించిన సీజే ధర్మాసనం

సాక్షి, అమరావతి: గత ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటివరకు కాంప్రహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (సీఎఫ్‌ఎంఎస్‌) ద్వారా చేసిన చెల్లింపులు, స్వీకరణలకు సంబంధించిన వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం స్టే విధించింది. పిటిషనర్‌కు చెల్లించాల్సిన రూ.5.63 లక్షలను ఇప్పటికే చెల్లించామని ప్రభుత్వం చెబుతోందని, ఈ ఒక్క కారణంతోనే సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చేసిన చెల్లింపులు, స్వీకరణ వివరాలను అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలన్న ఆదేశాలను మాత్రమే నిలుపుదల చేస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అప్పీల్‌పై తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

కేసు నేపథ్యమిదీ..
ప్రకాశం జిల్లా దర్శిలోని అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌కు అవసరమైన సామగ్రి సరఫరా చేసినందుకు గాను తనకు రూ.5.63 లక్షలను చెల్లించడం లేదని, ఈ మొత్తాన్ని చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బండి సుబ్బారెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల విచారణ జరిపారు. బిల్లును సంబంధిత శాఖ క్లియర్‌ చేసినా ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉండిపోయిందని పిటిషనర్‌ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.

2021లో ఆమోదించిన బిల్లును ఇప్పటివరకు ఎందుకు క్లియర్‌ చేయలేదో తెలుసుకునేందుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ వ్యక్తిగత హాజరుకు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల మేరకు రావత్‌ కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఆ నిర్దిష్ట హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌లో నిధులు లేవని, అందుకే చెల్లింపులు జరగలేదని రావత్‌ వివరించారు.

ఇంత చిన్న మొత్తం చెల్లించేందుకు డబ్బు లేదనడం రాష్ట్ర ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి, గత ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటివరకు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చేసిన చెల్లింపులు, స్వీకరణల వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని రావత్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు.

అత్యవసర అప్పీల్‌ దాఖలు చేసిన రావత్‌
సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ మంగళవారం అత్యవసరంగా లంచ్‌మోషన్‌ రూపంలో అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. రావత్‌ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 15వ తేదీనే పిటిషనర్‌కు రూ.5.63 లక్షల్ని ప్రభుత్వం చెల్లించేసిందని వివరించారు.

పిటిషనర్‌ కేవలం తన బిల్లు చెల్లింపు కోసమే పిటిషన్‌ వేశారని, కానీ.. న్యాయమూర్తి మాత్రం ఆ పిటిషన్‌ పరిధిని దాటి సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చేసిన చెల్లింపుల వివరాలు కోరారని తెలిపారు. కేవలం ఆ నిర్దిష్ట హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌లో మాత్రమే నిధులు లేవని చెప్పారే తప్ప ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం సుబ్బారెడ్డి తరఫు న్యాయవాదిని వివరాలు కోరింది. ఆయన కూడా అదే విషయం చెప్పడంతో సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించిన ధర్మాసనం.. అప్పీల్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు