ఉత్పత్తి ఉరకలెత్తేలా, రాష్ట్రానికి క్యూ కడుతున్న ఉక్కు కంపెనీలు

18 Jul, 2021 09:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతం అవుతున్నాయి. రాష్ట్రంలో భారీ ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలతో పాటు దేశీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)తో పాటు చిన్నాచితకా కలిపి మొత్తం 33 ఉక్కు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఏటా 8.4 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి వున్నాయి. ఇందులో ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఒక్కటే 6.3 మిలిమిన్‌ టన్నుల సామర్థ్యంతో ఉంటే మిలిగిన 32 కంపెనీలు 2.1 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే ఐదో స్థానంలో ఉన్న ఏపీని మూడవ స్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రస్తుతం ఉక్కు ఉత్పత్తిలో మొదటి నాలుగు స్థానాల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాలున్నాయి.
 
రాష్ట్రానికి కంపెనీల క్యూ 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కడప ఉక్కు ఫ్యాక్టరీలో భాగస్వామిగా చేరడానికి ఎస్సార్‌ స్టీల్‌ కంపెనీ ముందుకొచ్చింది. మూడు మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్‌ పనులను నవంబర్‌ నుంచి ప్రారంభించే విధంగా ఎస్సార్‌ స్టీల్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అలాగే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం రేవుకు సమీపంలో రూ.7,500 కోట్ల పెట్టుబడితో 2.25 మిలియన్‌ టన్నుల ఉక్కు తయారీ యూనిట్‌ ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ముందుకు రాగా.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. మరోవైపు దక్షిణ కొరియా ఉక్కు దిగ్గజ కంపెనీ పోస్కో కూడా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఆ కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే కృష్ణపట్నం వద్ద స్థలాలను పరిశీలించి వెళ్లారు. మరోవైపు హ్యుందాయ్‌ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ, గ్రీనె ట్‌క్‌ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దేశంలో తయారవుతున్న వాహనాల్లో ఉపయోగించే 55 శాతం ఉక్కు దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అవుతుండటం, రాష్ట్రంలో సుదీర్ఘ సముద్ర తీరం, పోర్టులు ఉండటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు వంటి అంశాలు ఉక్కు దిగ్గజ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.   

మరిన్ని వార్తలు