1.43 లక్షల టన్నుల ఆక్సిజన్‌ సరఫరా

26 Apr, 2021 08:00 IST|Sakshi

ఉక్కు నగరం (గాజువాక): దేశీయ ఉక్కు పరిశ్రమకు చెందిన స్టీల్‌ ప్లాంట్లు కరోనా చికిత్స కోసం వివిధ రాష్ట్రాలకు గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు 1.43 లక్షల టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేశాయి. శనివారం ఒక్కరోజే 3,474 టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేశాయి. దేశీయంగా ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో మరింతగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. స్టీల్‌ సెక్టార్‌లో మొత్తం 33 ఆక్సిజన్‌ ప్లాంట్‌లు ఉండగా 29 ప్లాంట్‌లు ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్రక్రియలో ఉన్నాయి.

వాటి రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 2,834 టన్నులు కాగా ఈ నెల 24న సామర్థ్యానికి మించి 3,474 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేశాయి. ఆయా ప్లాంట్లలో నైట్రోజన్, ఆర్గాన్‌ల ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఇది సాధ్యమైంది. ఈ నెల 24న 2,894 టన్నులను వివిధ రాష్ట్రాలకు సరఫరా చేశాయి. గతంలో రోజువారీ సరఫరా 1,500 నుంచి 1,700 టన్నులుగా ఉండేది. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) రోజుకు  800 టన్నులు సరఫరా చేస్తుండగా ఈ నెల 23న 1,150 టన్నులు, 24న 960 టన్నులు సరఫరా చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ గతేడాది 8,842 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేయగా ఏప్రిల్‌ 13 నుంచి ఇప్పటివరకు 1,300 టన్నులు సరఫరా చేసింది.

చదవండి: పోలవరానికి రూ.333 కోట్లు 
గ్రీన్‌ చానల్‌తో సకాలంలో ఆక్సిజన్‌ సరఫరా

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు