అనగనగా ఓ కథ.. రాయలసీమ కథా కార్యశాల

31 Dec, 2022 18:29 IST|Sakshi

రాయలసీమ కథా కార్యశాల.. అనగానే.. ఏంది కథ? అనుకున్నా.. ఏమిరా వీరశంకర్‌రెడ్డీ.. దీనివల్ల సమాజానికి లాభం?  పొరపాటుగా అలవాటైన సినీ ‘సీమ’యాసలో నన్ను నేను ప్రశ్నించుకున్నా..  నిర్వాహకులకు మోయలేని భారమేమో.. మనుషులు రాకపోతే అవమానమేమో.. నమ్మకంతో కూడిన సందేహం వ్యక్తం చేసుకున్నా.. కడపలో కథా కార్యశాల ముగిసి రెండు వారాలవుతున్నా వదలని ఆ జ్ఞాపకాలు..అనుభూతులు.. అనుభవాలు పై సందేహాలను పటాపంచలు చేశాయి.  చంచలమైన మనసుకు జవాబుదారీతనాన్ని నేర్పాయి.

సమాజం నుంచే కథ పుడుతుందని.. కథ వల్ల సమాజం అర్థమవుతుందని.. ఇదే సమాజానికి ప్రయోజనకరమని అవగతమైంది. మంచి కథకు మనుషుల కరువేం లేదని.. వచ్చినోళ్లందరూ గొప్ప రచయితలుగా రూపొందకపోయినా  సరికొత్త ‘మనుషులు’గా మారతారని .. మనసులను చూసే దృక్పథం ఒకటి అలవాటవుతుందని.. ‘మనో భార’మితి కనిపెట్టినంత సంతోషం వేసింది. హాజరు కోసం నేను గడిపింది కాసేపే అయినా.. కార్యశాల విజయగాథను వినిపించడానికి చాలా కసరత్తే చేయాల్సి వచ్చింది. కథ రాయడం ఓ కళ అని వర్ణించినా.. దానిని శాస్త్రీయంగా చెప్పి,  ఇలా చెప్పడం పేద్ద కళ అని నేర్పకనే నేర్పించారు.  రెండు రోజుల ప్రయాణంలో కొత్తదారిని కనుక్కునేలా చేశారు. 
షేక్‌ ముజుబుద్దీన్, సాక్షి, కడప డెస్క్‌

కడపలోని విశ్వేశ్వరయ్య భవన్‌ ప్రాంగణం.. ఈ నెల 17, 18 తేదీల్లో రాయలసీమ కథాకార్యశాలకు విచ్చేసిన అతిరథ మహారచయితలు, భావి కథకులతో కళకళలాడింది. సీమకు చెందిన మూడు తరాల రచయితలతో పాటు కథారచనలో మెళకువలు నేర్చుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 42 మంది వర్తమాన కథకులకు వేదికైంది. లబ్దప్రతిష్టులు జీవితకథలు చెప్పేందుకు ఈ కార్యశాల పాఠశాలలా మారింది.  ప్రసిద్ధ కథకులు డా.కేతు విశ్వనాథ్‌ రెడ్డి, షేక్‌ హుస్సేన్‌ సత్యాగ్ని, బండి నారాయణ స్వామి, శాంతి నారాయణల చేతుల మీదుగా కార్యశాల ప్రారంభమైంది. ప్రసిద్ధ కథకులు, విమర్శకులు.. శాంతి నారాయణ, దాదాహయాత్, డా.మేడిపల్లి రవికుమార్, పాలగిరి విశ్వప్రసాద్‌ రెడ్డి, జి.ఉమామహేశ్వర్, డా.వి.ఆర్‌.రాసాని, శ్రీనివాసమూర్తి, యోగివేమన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డా.ఎన్‌.ఈశ్వర్‌ రెడ్డి, యువ పరిశోధకులు డా.తవ్వా వెంకటయ్య తదితరుల అనుభవాలకు సజీవశిల్పంలా నిలిచింది. చివర్లో ప్రసిద్ధ రచయిత డా.బండి నారాయణ స్వామితో కథారచన మెళకువలపై ముఖాముఖి నడిచింది. మొత్తానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి కథాకార్యశాల సాహితీలోకంలో సరికొత్త పరిమళాలు వెదజల్లింది. యువ కథకుల భవిష్యత్తుకు భరోసానిచ్చింది. 

పేరుకు రాయలసీమ అని పెట్టినా.. గుంటూరు, ప్రకాశం, వైజాగ్, హైదారాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి ఔత్సాహికులు హాజరు కావడం కార్యశాల ప్రాధాన్యత తెలిపింది. రాయలసీమ కథా కార్యశాలే కాదు.. ఇపుడు హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ కూడా విశేషంగా విజయవంతం కావడం.. తెలుగు సాహిత్యం ఎన్నటికీ సుసంపన్నమేనని స్పష్టతనిస్తోంది. 2022 వెళుతూ వెళుతూ సాహితీపంట పడించింది. 2023 తెలుగింట కథల పండుగ తెస్తుందని చెప్పింది.  

ఉపసంహారం 
ఇలాంటి కథా కార్యశాలలు మరిన్ని జరగాలి. ప్రతి చోటా నిర్వహించాలి.  తద్వారా ప్రతి వ్యక్తి ఒక సంస్కారి కావాలి. ఇంటింటా సాహిత్యం     విరబూయాలి. పుస్తక పఠనం మరింత పెరగాలి. ఈ డిజిటల్‌ యుగంలో ప్రతి మనసు ఒక పుస్తకమై పరిమళించాలి. ఆపాదమస్తకం అనుభూతించాలి. కొత్తకథకు జీవితమవ్వాలి.

కథకు(డికి) ఉండాల్సిన లక్షణాలు

  • కథ జీవితం నుంచి, హృదయం నుంచి రావాలి. జీవితాంతం పాఠకుడి మనసులో నిలిచిపోవాలి. 
  • జీవితం పట్ల అవగాహన, విస్తృత పరిశీలన   ఉండాలి. విమర్శనాత్మకంగా చూడాలి.  
  • కథ ఓ కళ. శ్రద్ధతో నిరంతరం సాహిత్య, జీవిత అధ్యయనం చేస్తే.. దానిని పదికాలాలు కళకళలాడేలా రాయవచ్చు.   
  • కథ ముందుగా మనసులో, మెదడులో,  హృదయంలో, ఆలోచనల్లో నలగాలి.  
  • సమాజమే కథా కార్యశాల. సమాజంలోని  చలనాలను, మార్పుని చూడగలగాలి.  
  • కథలకు సామాజిక ప్రయోజనం ఉండాలి.
  • ప్రశ్నతోనే జీవితం బాగుపడుతుంది. ప్రశ్నలు వేయండి. వేసుకోండి.  
  • ఎంత ఎక్కువ చదివితే అంత చక్కగా   రాయగలరు. 
  • అన్నీ మన జీవితకాలంలో అనుభవించలేం, చూడలేం.. కాబట్టి చదవాలి. చదవడం ద్వారా జీవితం, అనుభవాలు అక్షరీకరించగలగాలి.
  • కథ ఉద్దేశ్యం వ్యక్తి సంస్కరణ. తద్వారా సమాజ సంస్కరణ. కథ సమస్య నుంచి సంస్కరణ దిశగా ఉండాలి. అయితే సందేశాలు ఇవ్వకూడదు, ఉండకూడదు. 
  • మార్పు వస్తుంది. నిదానం కావచ్చు. కానీ తప్పకుండా వస్తుంది.   
  • వ్యక్తులు మారితే కానీ సమాజం మారదు. బాహ్య పరిస్థితులు మనిషిని ప్రభావితం చేస్తాయి. 
  • పాత కథే అయినా కథాంశం కొత్తగా ఉండాలి. దానిని ఎలా చెప్పాలనే విషయంలో మనదైన    దృష్టికోణం కనిపించాలి. 
  • కథాంశం దగ్గరే కథ సగం విజయం      సాధిస్తుంది. 
  • కథకు ఆది..మధ్య..తుది ఉండాలి. ప్రారంభం ఆసక్తిగా.. ముగింపు ఆలోచింపజేసేదిగా ఉండాలి. 
  • కథావస్తువుల ఎంపికలో పునరుక్తి లేకుండా చూసుకోవాలి. 
  • కథల్లో భాష సూటిగా, స్పష్టంగా, అత్యంత సహజంగా ఉండాలి.
  • కథా శిల్పంలో సర్వం ఇమిడి ఉంటుంది.. శిల్పం వేరు భాష వేరు కాదు.
  • కథ ఎలా చెప్పాలో, ఎవరి కోణంలో చెప్పాలో రచయిత సాధన చేయాలి 
  • కనిపించని వ్యవస్థ కూడా కథలో పాత్రేనని గుర్తుంచుకోవాలి. 
  • మనిషి మోసం... ప్రాంతానికి, సందర్భానికి అన్వయించుకుంటే ఆశ్చర్యపోయే అంశాలు కథలుగా మారతాయి. 
  • ప్రాంతీయత, మాండలికం పాత్రలకు ప్రాణ    ప్రతిష్ట చేస్తాయి. 
  • పాత్రలు, జీవితం, సమాజం, ప్రకృతిలో       సంఘర్షణ తప్పదు 
  • పాత్రలకు తమవైన నేపథ్యాలు, వైరుధ్యాలుంటాయి. ఉండాలి.
  • సంఘర్షణ అనివార్యం. సంఘర్షణ ద్వారా పాత్రల మధ్య గొప్ప డ్రామా పుడుతుంది. 
  • కథల్లో పాత్రలు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. వాస్తవికతకు దగ్గరగా ప్రవర్తించాలి. 
  • వర్తమానానికి పునాది చరిత్ర. 
  • కథ చీకటి నుంచి వెలుగు వైపు నడిపించాలి . 
  • సమాజం పట్ల నిబద్ధత, బాధ్యత ఉండాలి.  
  • కవిలో భావావేశం అవసరం. రచయితలో అనవసరం.
  • రచయితకు శాస్త్రీయ దృక్పథం ఉండాలి. 
  • వర్తమాన రచయితలు విమర్శను తట్టుకోవాలి.  
మరిన్ని వార్తలు