Vizag: ‘టెక్‌’ల కేంద్రంగా విశాఖ

29 Oct, 2022 10:02 IST|Sakshi

సీఐఐ సదస్సులో మైక్రోసాఫ్ట్‌ ఇండియా క్లౌడ్‌ సైట్‌ లీడర్‌ చారుమతి శ్రీనివాసన్‌ 

ఇంక్యుబేటర్స్‌తో విశాఖలో కార్యకలాపాలను పెంచాలి

ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఏపీ ఇన్నోవేటివ్‌ సొసైటీతో ఎస్‌టీపీఐ ఒప్పందం 

సాక్షి, విశాఖపట్నం: సాంకేతిక రంగంలో భారత్‌ వేగంగా దూసుకుపోతోందని, 130 కోట్ల మంది ప్రజలంతా టెక్నాలజీలో భాగస్వాములు కావడం విశేషమని మైక్రోసాఫ్ట్‌ ఇండియా క్లౌడ్‌ సైట్‌ లీడర్‌ చారుమతి శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘వైజాగ్‌ ది నెక్ట్స్‌ టెక్‌ హబ్‌ ఆఫ్‌ ఇండియా’ అనే అంశంపై శుక్రవారం విశాఖలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, ఎడ్యుటెక్, ఫార్మాటెక్‌ రంగాల్లో దూసుకెళ్లేందుకు విశాఖకు అపార అవకాశాలున్నాయని తెలిపారు. స్టార్టప్‌ హబ్‌గా విశాఖ అభివృద్ధి చెందేందుకు ఇంక్యుబేటర్స్‌ ద్వా రా కార్యకలాపాలను  పెంచడంతోపాటు ఫ్రెండ్లీ పాలసీ ద్వారా ప్రధానసంస్థల్ని ఆకర్షించాలని సూచించారు. 81 శాతం పరిశ్రమలకు ఆవిష్కరణలే బలమని చెప్పారు. 

స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు ఏపీ కీలకం
సదస్సు సందర్భంగా ఎస్‌టీపీఐ, ఎస్‌టీపీఐ నెక్టస్‌ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఇన్నోవేషన్‌ సొసైటీ నేతృత్వంలో ఇండస్ట్రీ 4.0 ద్వారా ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేలా ఒప్పందం కుదిరింది. పరిశ్రమలతో పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకునే వాతావరణాన్ని ఎస్‌టీపీఐ సృష్టిస్తుందని సదస్సును ప్రారంభించిన సంస్థ డైరెక్టర్‌ సీవీడీ రామ్‌ప్రసాద్‌ తెలిపారు.

విశాఖలో ఆర్‌ఐఎన్‌ఎల్‌తో కలిసి ఆవిష్కరణలు, అంకుర సంస్థల్ని ప్రోత్సహించేందుకు ఇండస్ట్రీ 4.0 ప్రారంభించామని చెప్పారు. స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు ఏపీ కీలకమన్నారు. ఐటీ సెక్టార్‌తో విద్యుత్‌ రంగం కలిసి పనిచేస్తే వినియోగదారుల సమస్యలను మరింత త్వరగా పరిష్కరించేందుకు మార్గం సుగమమవుతుందని సీఐఐ మాజీ చైర్మన్‌ డి.రామకృష్ణ తెలిపారు. స్టీల్‌ప్లాంట్, సెమ్స్, మారిటైమ్‌ యూనివర్సిటీ, ఎక్స్‌పోర్ట్‌ హబ్‌ లాంటి సంస్థలతో విశాఖ పారిశ్రామిక నగరంగా ఇప్పటికే అభివృద్ధి చెందిందని, ఐటీ హబ్‌గా ఎదిగే రోజులు సమీపంలోనే ఉన్నాయన్నారు. సీఐఐ వైస్‌ చైర్మన్‌ పీపీ లాల్‌కృష్ణ,  పలు ఐటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు