దున్నపోతులతో తొక్కిస్తే అరిష్టాలు తొలగుతాయని..

12 Apr, 2021 03:58 IST|Sakshi
భక్తులపై దున్నపోతును నడిపిస్తున్న దృశ్యం

తూర్పుగోదావరి జిల్లా అమీనాబాద్‌లో వింత ఆచారం  

కొత్తపల్లి: గ్రామానికి అరిష్టం పోవాలని, తమ కష్టాలు తీరాలని పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరి పడుకుని దున్నపోతుతో తొక్కించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం అమీనాబాద్‌లో జరిగే పోలేరమ్మ తీర్థంలో పూర్వం నుంచీ ఈ వింత ఆచారం కొనసాగుతోంది. ఆదివారం జరిగిన ఈ ఉత్సవంలో ఉదయం నుంచి ఉపవాసం ఉన్న భక్తులు, గ్రామస్తులు తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం దున్నపోతుకు పూజలు చేసి, గరగ నృత్యాల మధ్య గ్రామంలో ఊరేగించి, ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఉపవాసం ఉన్న భక్తులందరూ పసుపు నీళ్లతో స్నానం చేసి, అమ్మవారి ఆలయం ఎదురుగా బారులు తీరి పడుకున్నారు. వెంటనే ఆ దున్నపోతును తీసుకుని ఒక భక్తురాలు పడుకున్న వారి మీదుగా నడిపించింది. భక్తులు ఇలా మూడుసార్లు దున్నపోతుతో తొక్కించుకున్నారు. ఇలా చేయడం వల్ల గ్రామానికి ఉన్న అరిష్టం పోవడంతో పాటు, తమ కష్టాలు తొలగిపోతాయని వారు నమ్ముతారు. ఏటా క్రమం తప్పకుండా ఈ ఆచారాన్ని వారు పాటిస్తున్నారు. గతంలో ఈ దున్నపోతును బలి ఇచ్చేవారు. ప్రస్తుతం ఉత్సవం అనంతరం దానిని విడిచిపెట్టేస్తున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు