AP: రూ.100 కోట్లతో ల్యాబ్‌లు బలోపేతం

19 Mar, 2022 07:45 IST|Sakshi

ఇకపై మరింత సమర్థవంతంగా ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు

వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ నుంచి జిల్లా ఆసుపత్రి వరకూ..

టెస్టులు బయటకు రిఫర్‌ చేయడానికి వీలుండదు

ఫిర్యాదులు చేసేందుకు ఫోన్‌ నంబర్లతో బోర్డులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబొరేటరీ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ఇందుకోసం రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో వైద్య, ఆరోగ్య శాఖలో సంస్కరణలు చేపట్టడానికి  ఐఏఎస్‌ మాజీ అధికారి సుజాతారావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేసింది. ప్రభుత్వ రంగంలో వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఐదేళ్లలో రూ.10వేల కోట్ల మేర ఖర్చుచేయాలని అప్పట్లో కమిటీ ప్రభుత్వానికి నివేదించింది.

చదవండి: బాబు.. ఏబీ.. ఓ పెగసస్‌ ఇప్పుడేమంటారు..?

కానీ, ఈ కమిటీ సూచించిన దానికన్నా అదనంగా సర్కారు నాడు–నేడు కార్యక్రమం ద్వారా రూ.వేల కోట్ల ఖర్చుచేస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లోనే నిర్ధారణ పరీక్షలు (ఇన్‌హౌస్‌ ల్యాబొరేటరీ) ఏర్పాటుచేయాలని సుజాతారావు కమిటీ సిఫార్సు చేసింది. దీంతో ల్యాబొరేటరీలు ఏ విధంగా బలోపేతం చేయాలన్న దానిపై వైద్యశాఖ ఓ కమిటీ వేసి, దాని సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంటోంది.

విలేజ్‌ క్లినిక్‌ నుంచి జిల్లా ఆసుపత్రి వరకూ..
వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ నుంచి జిల్లా ఆసుపత్రి వరకూ అన్ని ఆసుపత్రుల్లో ల్యాబ్‌లకు ఉపకరణాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేపడుతున్నారు. అయితే, మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తగ్గట్టుగా వనరులు అందుబాటులోకి తెస్తున్నారు. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లో 14, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 35, సీహెచ్‌సీలో 78, ఏరియా ఆస్పత్రుల్లో 80, జిల్లా ఆస్పత్రుల్లో 136 రకాల వైద్య పరీక్షలు చేయడానికి వీలుగా అవసరమైన ఉపకరణాలను ఏపీఎంఎస్‌ఐడీసీ సమకూరుస్తోంది.  రసాయనాలు (రీఏజెంట్స్‌), డిస్టిలరీ వాటర్‌తో సహా అన్నింటినీ సరఫరా చేస్తున్నారు.

నెలాఖరు నుంచి అందుబాటులోకి సేవలు
సొంతంగా ల్యాబొరేటరీల నిర్వహణవల్ల వ్యయం తగ్గడంతో పాటు రోగులకు సేవలు మెరుగుపడతాయి. ఈ నెలాఖరుకు అన్ని ఆసుపత్రుల్లో సేవలు ప్రారంభించాలని చెప్పాం. గతంలో రీఏజెంట్స్‌ స్థానికంగా కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం వాటిని కూడా సరఫరా చేస్తున్నాం. దీంతో అవి లేవు, ఇవి లేవు అని పరీక్షలకు బయటకు రిఫర్‌ చేయడానికి వీలుండదు. ప్రతి ఆసుపత్రిలో బోర్డు పెడతాం. ఫిర్యాదులు చేయడానికి వీలుగా ఫోన్‌ నెంబర్‌నూ ప్రదర్శిస్తాం.
 – కాటమనేని భాస్కర్, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌    

>
మరిన్ని వార్తలు