కరోనా కట్టడికి పటిష్ట చర్యలు

28 Apr, 2021 04:03 IST|Sakshi

తగినన్ని ఆక్సిజన్‌ నిల్వలు, మందులు అందుబాటులో ఉన్నాయి 

హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశంపై సివిల్‌ లిబర్టీసీస్‌ అసోసియేషన్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి అడగడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వ న్యాయవాది సుమన్‌ వివరించారు. ప్రత్యేకంగా జీవోలు, మార్గదర్శకాలు జారీచేసి కరోనా కట్టడికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టిందన్నారు.

ఉన్నతాధికారులతో రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో కమిటీలను నియమించి ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని చెప్పారు. కరోనా ఆస్పత్రుల నిర్వహణను పర్యవేక్షిస్తూ తగినన్ని పడకలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలో తగినన్ని ఆక్సిజన్‌ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు చేపట్టాల్సిన చర్యలు, జాగ్రత్తలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తదనుగణంగా చర్యలు చేపడుతోందని చెప్పారు. కరోనా అంశంలో అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.   

ధూళిపాళ్ల బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ 
టీడీపీ సీనియర్‌ నేత, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర, డెయిరీ ఎండీ పి.గోపాలకృష్ణన్‌ల బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. తమపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, తమకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ధూళిపాళ్ల నరేంద్ర, పి.గోపాలకృష్ణన్‌æ రెండు వేర్వేరు పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు మంగళవారం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు, ఏసీబీ తరఫున ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు.  

ఉప ఎన్నిక కేసు విచారణ వాయిదా 
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ అభ్యర్థి రత్నప్రభ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈనెల 17న తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.  

డిప్యూటీ జైలర్‌ పోస్టుల రద్దు పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయండి
డిప్యూటీ జైలర్‌ పోస్టులను శాశ్వతంగా తొలగిస్తూ జారీ చేసిన జీవో నంబర్‌ 145, జీవో నంబర్‌ 2ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ప్రభుత్వానికి మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఆ రెండు జీవోలను సవాల్‌ చేస్తూ న్యాయవాది ఆంజనేయులు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

విచారణలో భాగంగా  పిటిషనర్‌ వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కౌంటర్‌ దాఖలు చేయాలని  ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ,  హోంశాఖ ముఖ్య కార్యదర్శి, జైళ్ల శాఖ డీజీ, డీఐజీకి నోటీసులు జారీ చేశారు.  విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు