ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

8 Feb, 2021 04:02 IST|Sakshi
స్థానిక ఎన్నికల నేపథ్యంలో విజయవాడలోని రామవరప్పాడు వద్ద పోలీసుల తనిఖీలు

ఏజెన్సీలో ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు ఐదుగురు పోలీసులు

రాష్ట్రవ్యాప్తంగా 1,122 రూట్‌ మొబైల్‌ పార్టీలు

257 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌.. 143 స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ టీమ్‌లు 

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఓటు హక్కుపై చైతన్య కార్యక్రమాలు

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టింది. గతంలో వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు ఉన్నట్లు గుర్తించిన ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా దృష్టి సారించారు. ఫ్యాక్షన్‌  ప్రభావిత ప్రాంతాలు, ఘర్షణలు నమోదైన గ్రామాలు, సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. 4 దశల్లో 13,133 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 6,254 తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలు, 8,555 సమస్యాత్మక ప్రాంతాలు, 983 వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలున్నట్లు గుర్తించారు.

పోలీస్‌ సిబ్బంది, హోంగార్డులు కలిపి 89,100 మంది ఉండగా రోజువారీ శాంతి భద్రతల విధులు, ట్రాఫిక్, ఇతర బాధ్యతలకు సిబ్బందిని కేటాయించిన అనంతరం మిగిలిన వారికి ఎన్నికల విధులు నిర్దేశించారు. పోలింగ్‌ స్టేషన్ల బందోబస్తులో భాగంగా 1,122 రూట్‌ మొబైల్‌ పార్టీలు ఏర్పాటు చేశారు. ఒక్కో మొబైల్‌ పార్టీలో ఒక అధికారి, ఇద్దరు సిబ్బంది ఉంటారు. ఒక్కో టీమ్‌లో ఒక అధికారి, ముగ్గురు సిబ్బంది ఉండేలా మొత్తం 257 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. 143 స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఒక పోలీస్‌ అధికారితోపాటు ఐదుగురు సిబ్బంది ఉండేలా 199 మొబైల్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 61 స్ట్రాంగ్‌ రూమ్స్‌ భద్రతా టీమ్‌లు, ఎస్పీ రిజర్వ్‌ 9 పార్టీలు, అడిషనల్‌ ఎస్పీ 9 పార్టీలతోపాటు అవసరమైన మేరకు ఏపీఎస్పీ బలగాలను వినియోగిస్తారు.

బహిష్కరణకు మావోయిస్టుల పిలుపు
ఎన్నికలను బహిష్కరించాలని ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓటు హక్కు వినియోగం, ప్రజాస్వామ్య వ్యవస్థపై గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలను నిర్వహించారు. ఆంధ్రా–ఒడిశా బోర్డర్‌లోని గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌కు ఒక పోలీస్‌ అధికారితోపాటు నలుగురు సిబ్బంది చొప్పున బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీ పేరుతో ఒక అధికారి, ఐదుగురు పోలీస్‌ సిబ్బందితో ప్రత్యేక టీమ్‌లను నియమించారు. ప్రత్యేక గస్తీకి ఏరియా డామినేషన్‌ టీమ్స్‌ను రంగంలోకి దించారు. ప్రత్యేకంగా డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తున్నారు. 

మరిన్ని వార్తలు