Andhra Pradesh: ‘ప్లాస్టిక్‌’పై నిషేధం పక్కాగా అమలు

8 Jan, 2023 10:23 IST|Sakshi

ఐదు నెలల్లో 123 పట్టణాల్లో   39,242 చోట్ల తనిఖీలు

75 మైక్రాన్లకంటే తక్కువ  మందం ఉన్న ప్లాస్టిక్‌ వాడితే కేసులు

117.57 టన్నుల ప్లాస్టిక్‌ సీజ్‌

విక్రేతలు, వాడకందారులపై  రూ.1.80 కోట్ల జరిమానా

బహిరంగంగా తగులబెట్టినందుకు రూ.6.53 లక్షల జరిమానా

ఇకపై 120 మైక్రాన్లకంటే తక్కువ మందముంటే కఠిన చర్యలు

సాక్షి, అమరావతి: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిఘాను తీవ్రం చేసింది. నిషేధించిన ప్లాస్టిక్‌ సంచుల తయారీదారులు, స్టాకిస్టులు, వినియోగదారులపై చర్యలు చేపడుతోంది. 75 మైక్రాన్లు, అంతకంటే తక్కువ మందం గల ప్లాస్టిక్‌ సంచులను గతేడాది జూలై నుంచి ప్రభుత్వం నిషేధించింది. దీనిపై తయారీదార్లు, స్టాకిస్టులకు ముందుగానే కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్‌ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.

తయారీదార్ల విజ్ఞప్తి మేరకు గత డిసెంబర్‌ 31 వరకు 75 మైక్రాన్ల మందం గల ప్లాస్టిక్‌ సంచుల వాడకానికి అనుమతించారు. అంతకంటే తక్కువ మందం గల ప్లాస్టిక్‌పై నిషేధాన్ని కొనసాగించారు. గతేడాది జూలై నుంచి నవంబర్‌ వరకు ఐదు నెలల్లో రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 964 బృందాలు 39,242 చోట్ల తనిఖీ చేశాయి. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్‌ సంచులను నిల్వ చేసిన వ్యాపారుల నుంచి 117.57 టన్నుల సరుకును సీజ్‌ చేశారు. స్టాకిస్టులు, వాడకందారుల నుంచి రూ.1.80 కోట్లు జరిమానాగా వసూలు చేశాయి. పర్యావరణానికి హానికలిగించే రీతిలో బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ చెత్తను తగులబెట్టిన వారి నుంచి అధికారులు రూ.6,53,643 జరిమానా వసూలు చేశారు.

ఇకపై 120 మైక్రాన్ల సంచులకే అనుమతి
గత ఏడాది డిసెంబర్‌ 31 నుంచి ప్లాస్టిక్‌ వాడకంపై కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తయారీ నుంచి వాడకం వరకు అన్ని స్థాయిల్లోనూ పునర్వినియోగానికి అనువైన 120 మైక్రాన్ల మందం గల ప్లాస్టిక్‌ సంచులకే అనుమతినిచ్చింది. అంతకంటే తక్కువ మందం ఉంటే తయారీ, అమ్మకంతో పాటు వాడకంపైనా భారీ జరిమానాలు విధించేందుకు కార్యాచరణ రూపొందించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌లోని ప్లాసిŠట్‌క్‌ తయారీ సంస్థల నుంచి వచ్చే సరకు లెక్కలున్నాయి, యూపీ, బిహార్‌ నుంచి అనుమతి లేకుండా వస్తున్న దిగుమతులపై అధికారులు నిఘా పెట్టారు. వ్యాపారులు, నిల్వదారులు ఇకపై 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న సంచులను ఉంచుకుంటే 
భారీ జరిమానా విధించడంతో పాటు చట్టపరంగా కేసులు నమోదు చేస్తారు. 

మరిన్ని వార్తలు