ఆస్పత్రుల్లో అధిక చార్జీలపై కఠిన చర్యలు

22 Apr, 2021 05:45 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

సెకండ్‌ వేవ్‌ను అడ్డుకునేందుకు సీఎం జగన్‌ కార్యాచరణ

మంత్రి బుగ్గన వెల్లడి

కర్నూలు కల్చరల్‌/వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలు మాత్రమే వసూలు చేయాలని, అంతకుమించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ హెచ్చరించారు. బుధవారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రైవేటు ఆస్పత్రులపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ద్వారా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ను సమర్థంగా అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక చర్యలు చేపడుతున్నారన్నారు. ఐదుగురు మంత్రులతో కమిటీ వేసి పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. గత సంవత్సరం కోవిడ్‌ కట్టడిలో సమర్థంగా పనిచేసిన టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డిని రాష్ట్ర కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ చైర్మన్‌గా నియమించారన్నారు. కోవిడ్‌ నివారణ, వ్యాక్సినేషన్‌ పర్యవేక్షణకు 21 మంది ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీలు వేశారన్నారు. ప్రతి జిల్లాకు కోవిడ్‌ స్పెషలాఫీసర్లుగా సీనియర్‌ అధికారులను నియమించినట్లు తెలిపారు. కోవిడ్‌ బాధితుల వైద్యం కోసం మందులు, ఆక్సిజన్‌ కొరత రానీయకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.

నిబంధనలు పాటించాలి
కరోనా చికిత్సలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోని ప్రైవేట్‌ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కరోనా పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా పని చేస్తోందన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు