కోడిపందేల కట్టడికి పటిష్ట చర్యలు..‘బరి’తెగిస్తే ఖబడ్దార్‌ 

10 Jan, 2023 14:25 IST|Sakshi

బరులు ధ్వంసం చేయిస్తున్న పోలీసులు 

జిల్లాలో 2,100 కేసుల నమోదు 

సాక్షి, భీమవరం(ప.గో. జిల్లా): సంక్రాంతి పండగకు సంప్రదా యం పేరుతో జరిగే కోడిపందేల కట్టడికి పోలీసుశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. పండగ మూడు రోజులపాటు నిర్వహించే కోడి పందేలు, జూదాలను అడ్డుకోవడంపై జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు గత 15 రోజులుగా జిల్లావ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో పందేలకు బరులు ఏర్పాటుచేసే ప్రాంతాలను పరిశీలించడంతో పాటు నిర్వాహకులతో మాట్లాడటం, జూదాలు నిర్వహించిన వారిని ముందుస్తు బైండోవర్‌ చేయడం, కోడి కత్తులు తయారీ, కట్టేవారిపై ప్రత్యేక నిఘా పెట్టి అదుపులోనికి తీసుకుని కేసులు నమోదు చేయడం, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌), పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో పందేల వల్ల కలిగే అనర్థాలను విస్తృతంగా ప్రచారం చేయడం వంటి చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు సుమారు 2,100 కేసులు నమోదుచేసి కత్తులు తయారుచేసేవారిని 155 మంది గుర్తించి 50 కత్తులను సీజ్‌ చేశారు.  

గ్రామస్తుల సహకారంతో కట్టడి 
సంక్రాంతి జూదాలను కట్టడి చేయడానికి పోలీసుశాఖ గ్రామస్థాయి కమిటీల సమన్వయంతో పనిచేస్తోంది. ప్రతి గ్రామంలో వలంటీర్లు, సచివాలయ పోలీసు సిబ్బంది అందుబాటులో ఉండటంతో ముందుస్తుగా బరులను సిద్ధం చేస్తున్న ప్రాంతాలపై సమాచారం సేకరిస్తున్నారు. గతంలో పందేలు వేసిన బరుల స్థల యజమానులకు ముందస్తు నోటీసులిచ్చి పందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.  

విస్తృత తనిఖీలు 
గ్రామాల్లో పందేలు నిర్వహించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పందేలను సిద్ధం చేస్తున్న బరులను, పందేలకు అనువుగా ఉన్న స్థలాలను ట్రాక్టర్లతో దున్నించి ధ్వంసం చేయిస్తున్నారు. అలాగే గతంలో పందేలు నిర్వహించిన జూదరులను హెచ్చరించడంతో పాటు అనర్థాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.  

ప్రత్యేక నిఘా 
ఏటా జిల్లావ్యాప్తంగా మూడు రోజులుపాటు కోడి పందేలు జరుగుతున్నాయి. ప్రధానంగా భీమవరం, కాళ్ల, యలమంచిలి, మొగల్తూరు, పెంటపాడు, త ణుకు, పెనుగొండ, అత్తిలి, వీరవాసరం, పాలకొల్లు, పోడూరు, ఆకివీడు మండలాల్లో భారీ పందేలు జరుగుతుండటంతో పోలీసు అ«ధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు.  
 
కఠిన చర్యలు  
సంక్రాంతికి సంప్రదాయం పేరుతో కోడిపందేలు, జూదాలు ని ర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే  సుమారు 2 వేల మందికి పైగా కేసులు నమోదు చేశాం. జూదాల వల్ల కలిగే అనర్థాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. పండగలకు ఆనందంగా చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. 
– యు.రవిప్రకాష్, ఎస్పీ, భీమవరం

మరిన్ని వార్తలు