పెళ్లి పుస్తకంలో రంగుల పేజీలు 

4 Dec, 2022 19:08 IST|Sakshi

పెళ్లి కళ వచ్చేసిందే బాలా.. సంప్రదాయానికి సరికొత్త హంగులు

దృశ్య కావ్యంలా వివాహాల తంతు

ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. మెహందీ.. సంగీత్‌ ఉపాధి అవకాశాలు

అంది పుచ్చుకుంటున్న యువత

జిల్లాలో మొదలైన పెళ్లి సందడి

పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయనేది పాత మాట.. ఇక్కడే స్వర్గం సృష్టిస్తామనడం నయా ట్రెండ్‌.. సంప్రదాయ తంతుకు సరికొత్త  హంగులద్దుతున్నారు.. ఎంగేజ్‌మెంట్‌ హంగామా.. ప్రీవెడ్డింగ్‌ షూట్‌.. ప్రత్యేక అలంకరణలు.. మెహందీ.. సంగీత్‌ వంటి వాటితో మెగా ఈవెంట్‌ను తలపింపజేస్తున్నారు.. వివాహాది శుభకార్యాలను పదికాలాల పాటు పదిలపర్చుకోవాలని వధూవరులు చూపిస్తున్న ఆసక్తిని ఉపాధిగా మలుచుకుంటున్నారు కొందరు. ముహూర్తాలు మొదలవడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెళ్లిసందడి ప్రారంభమైంది.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : పెళ్లిచూపులు, నిశ్చయ తాంబూలాల నుంచి వివాహ వేడుక వరకూ భారీ బడ్జెట్‌తో జరుగుతున్నాయి. ఎంగేజ్‌మెంట్‌ అయిన తర్వాత ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ పేరుతో వీడియోలు, ఫొటోలు తీయించుకోవడం పెళ్లి పుస్తకంలో మధుర ఘట్టంలా వధూవరులు భావిస్తున్నారు. దీంతో ఫొటో, వీడియోగ్రాఫర్లకు ఉపాధి లభిస్తోంది. అలాగే వివాహ వేడుకలో పూర్వకాలం నుంచి అరివేడు ముంత, పూలజడ, చమ్మిలి దండ, అడ్డుతెర, ఉంగరాల ఆట బిందె, మంగళస్నానాల జల్లెడ, గొడుగులు వంటి వాటికి ప్రాధాన్యముంది. పెళ్లివారి అభిరుచులకు అనుగుణంగా వీటిని రంగులు, అద్దాలతో ప్రత్యేకంగా అలంకరిస్తూ ఆకట్టుకుంటున్నారు డిజైనర్లు.  

భలే ముహూర్తం 
ఈ ఏడాది వరుసగా మూడు నెలల మూఢం కారణంగా ఎటువంటి శుభకార్యాలు జరగలేదు. ఈనెల మొదటి వారంలోనే మూఢానికి ముగింపు పడగా కొద్దిపాటు ముహూర్తాలు అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 2న రాత్రి నుంచి కొద్దిపాటి పెళ్లిళ్ల ముహూర్తాలు మొదలయ్యాయి. అలాగే జనవరిలో 25 నుంచి మాఘమాసం ప్రవేశించి ఫిబ్రవరి 11వ తేదీ వరకూ గట్టి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అనంతరం మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 26వ తేదీ వరకూ గురు మూఢం ప్రవేశిస్తుండడంతో ముహూర్తాలకు బ్రేక్‌ పడనుంది.  

మెండైన ఉపాధి : వివాహాది శుభకార్యాలు మొదలుకావడంతో ఇప్పటికే చాలా మంది బ్యూటీషియన్లను బ్రైడల్‌ మేకప్‌ల కోసం రిజర్వ్‌ చేసుకున్నారు. అలాగే ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు డిమాండ్‌ పెరిగింది. వీరితో పాటు పూలు, విద్యుత్‌ అలంకరణ చేసేవారు, ఫుడ్, ఐస్‌క్రీమ్, పాన్‌ సప్లయర్లు, కేటరర్లు, ఆయా వర్గాలకు సంబంధించిన సహాయకులకు చేతినిండా పని దొరుకుతుందనే ఆశతో ఉన్నారు. దాదాపు మూడు నెలలపాటు ముహూర్తాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు వెళ్లిన వారంతా తిరిగి ఇటుగా రానున్నారు.   

దృశ్య కావ్యంలా..  
వధూవరుల మంగళస్నానాలకు వినియోగించే పాత్రలు, మహారాజా తలపాగాలు, కాళ్లకు తొడిగే పావుకోళ్లు, రోళ్లు, రోకళ్లు, బాసికాలు, విదేశీ పూలజడలు, అల్లికల జాకెట్లు, పట్టువస్త్రాలు, వధూవరులు ఆకర్షణీయంగా కనిపించడానికి బ్రైడల్‌ మేకప్‌లు, పూచ్చిపూల మండపాలు, విద్యుద్దీపాలంకరణ, బాణసంచా సందడి, ఆర్కెస్ట్రా, వింధు భోజనాలు ఇలా అన్నింటా ప్రత్యేకతకు ప్రాధాన్యమిస్తున్నారు. మొత్తంగా దృశ్యకావ్యంలా వివాహ తంతును జరిపించేందుకు పలువురు ఆసక్తి చూపడంతో ఆయా రంగాల్లో ని ఎందరో ముహూర్తాల సీజన్‌లో  ఉ పాధి పొందుతున్నారు.  

మెహందీ.. సంగీత్‌ వేడుకలు
వివాహా వేడుకల్లో ముఖ్యంగా మెహందీ, సంగీత్‌లు ప్రత్యేకతను సంతరించుకుంటున్నా యి. ఉత్తర భారతదేశంలో ఉండే ఈ వేడుకలు ఇటీవల జిల్లాలోను తళుక్కుమనిపిస్తున్నాయి. గోరింటాకు పెట్టుకోవడం, సినీ గీతాలకు నృత్యాలు చేయడం వంటి పనులు వినోదాత్మకంగా జరుగుతున్నాయి. దీంతో బ్యూటీషియన్లు, ఈవెంట్‌ మేనేజర్లకు ఉపాధి లభిస్తోంది.  

ఈవెంట్‌ అంటే ఓ కళ 
పెళ్లంటే సంప్రదాయ సంబరం. అందరినీ ఒకదగ్గరకు చేర్చి వినోదాన్ని పంచాలి. అలాంటి ఈవెంట్‌ను నిర్వహించడంలో ఓ కిక్‌ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరితో డ్యాన్స్‌ చేయిస్తే ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా విజయం సాధించినట్టే. ఒక్కోసారి ముహూర్తం అర్ధరాత్రి ఉంటుంది. అటువంటప్పుడు అందరినీ ఆహ్లాదపరుస్తూ సమయం గడిచేలా చేయడం కూడా కళగా భావిస్తున్నాం.  
– అల్లాడ లావణ్య, ఈవెంట్‌ మేనేజర్‌

ఓపిగ్గా మేకప్‌ 
బ్రైడల్‌ మేకప్‌ను ఎంతో ఓపికగా చేయాలి. దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. ఒక్కొక్కరి శరీర ఛాయకు సరిపడేలా రంగులు అద్దాల్సి ఉంటుంది. దానిని గుర్తించడం బ్యూటీషియన్‌కు సవాలే. కరోనా తర్వాత చాలా మంది బ్రైడల్‌ మేకప్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనికి తోడు చాలా మంది ఈ రంగంలోకి రావడంతో పోటీ పెరిగి ఆదాయం తగ్గింది. అలాగే ఖర్చు కూడా పెరుగుతోంది.  
– బండి శిరీష, బ్యూటీషియన్, సిరీస్‌ హెయిర్‌ అండ్‌ బ్యూటీ

ప్రత్యేక అలంకరణలు 
పెళ్లి తంతులో వినియోగించే ప్రతి వస్తువునూ ఆకర్షణీయంగా అలంకరించడం ట్రెండ్‌గా మారింది. ఇందుకు అనుగుణంగా గరికి ముంతలు, అవిరేడు ముంతలు, బాసికాలు, తలపాగాలు, సంప్రదాయ టోపీలు, పూల జడలు, గొడుగులు, బుట్టలు, బిందెలు వంటివి ప్రత్యేకంగా అలంకరిస్తున్నాం. ప్రతి దానికీ హంగులు అద్దుతూ పూసలు, పెయింటిగ్‌లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాం.  
– పి.ఉమా మహేశ్వరిదేవి, శ్రీదేవి ఉమెన్స్‌ వరల్డ్‌ యజమాని

ప్రీ వెడ్డింగ్‌ షూట్‌తో.
ఇటీవల ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ నంచి ఫొటో, వీడియోగ్రాఫర్లకు పెళ్లి పని మొదలవుతోంది. చాలామంది ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కు ఆసక్తి చూపుతున్నారు. ఇది ఫొటోగ్రాఫర్ల పనితనానికి మచ్చు తునకగా నిలుస్తోంది. దీంతో మేం అందమైన లొకేషన్లను వెదుకుతున్నాం. పెళ్లి తంతులో ప్రతి ఘట్టాన్నీ కవర్‌ చేయాల్సి ఉంది. ఇందుకు తగ్గట్టు ఖరీదైన కెమెరాలు వాడుతున్నాం. వివాహాల కవరేజ్‌ను బట్టి ప్యాకేజీ ఉంటుంది. 
– కరణం ఫణి, ఫొటోగ్రాఫర్‌   

మరిన్ని వార్తలు