బాల్య విద్యకు బలమైన పునాది

18 Jan, 2023 02:23 IST|Sakshi

సత్ఫలితాలు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణలు 

కేంద్ర ప్రభుత్వ తాజా పీజీఐలో లెవల్‌–2 స్థాయికి చేరిన రాష్ట్రం 

3వ తరగతిలో లాంగ్వేజ్, మ్యాథ్స్‌ల్లో 20కి 20 స్కోర్‌ 

5వ తరగతిలో 20కి 18 సాధించిన విద్యార్థులు 

ఫౌండేషనల్‌ విద్యపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ఈ ఫలితాలు 

మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయ ప్రగతి పాలన, నిర్వహణ అంశాల్లోనూ 100 శాతం పురోగతి 

రాష్ట్ర విద్యార్థులకు ఫౌండేషనల్‌ విద్య నుంచే బలమైన పునాదులు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన పెర్‌ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌ (పీజీఐ) 2020–21లో ఆంధ్రప్రదేశ్‌ అత్యుత్తమ స్కోర్‌ పాయింట్లను సాధించి లెవల్‌–2 స్థాయిని దక్కించుకుంది. లెర్నింగ్‌ అవుట్‌కమ్స్, నాణ్యత, యాక్సెస్, మౌలిక వసతులు, ఈక్విటీ, పరిపాలన, నిర్వహణ అంశాల్లో ఈ ప్రగతిని సాధించింది. 

సాక్షి, అమరావతి: పిల్లల్లో 3 నుంచి 6 ఏళ్లలోపు మెదడు అభివృద్ధి చెందుతుందని.. ఈ సమయంలో వారికి సరైన ఫౌండేషనల్‌ విద్యను అందించాల్సిన అవసరముందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఫౌండేషనల్‌ విద్యకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇదే అంశాన్ని తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా నూతన విద్యావిధానంలో చేర్చింది. అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలోని పాఠశాలలతో అనుసంధానిస్తూ అక్కడి పిల్లలకు ఆటపాటలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో ప్రత్యేక సిలబస్‌తో.. ఆకర్షణీయమైన చిత్రాలతో పుస్తకాలను కూడా తెచ్చింది. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని సైతం అందిస్తోంది. వీటన్నిటి ఫలితంగా విద్యార్థుల్లో అక్షర, అంకెల పరిజ్ఞానం, అభ్యసన సామర్థ్యాలు క్రమేణా మెరుగుపడుతున్నాయి. దీంతో గత ప్రభుత్వాల హయాంలో పీజీఐ ర్యాంకింగ్స్‌లో వెనుకంజలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు లెవల్‌–2 స్థాయిని దక్కించుకుంది. 

పురోగతికి సాక్ష్యంగా పీజీఐ స్కోర్‌ 
పీజీఐకిప్రామాణికంగా తీసుకొనే వివిధ అంశాల్లో ఏపీ గతంలో కంటే మెరుగైన అభివృద్ధిని సాధించింది. ఆయా అంశాల్లో రాష్ట్రం సాధించిన స్కోర్‌ పాయింట్లే ఇందుకు నిదర్శనం. ఆయా అంశాల్లో గరిష్ట పాయింట్ల వారీగా స్కోర్‌ చూస్తే లెర్నింగ్‌ అవుట్‌కమ్స్, నాణ్యతల్లో 180కి 154, యాక్సెస్‌లో 80కి గాను 77, మౌలిక వసతుల కల్పనలో 150కి 127, ఈక్విటీలో 230కి 210, పాలన, నిర్వహణల్లో 360కి 334 పాయింట్లను ఏపీ సాధించింది. 

‘యాక్సెస్‌’లోనూ మెరుగైన పాయింట్లు 
ఇక రెండో ప్రామాణికమైన ‘యాక్సెస్‌’కు సంబంధించి రిటెన్షన్‌ రేట్‌ (ఒక స్కూల్‌లో చేరిన విద్యార్థులు అక్కడ చివరి తరగతి వరకు కొనసాగడం)లో ఎలిమెంటరీ, ప్రైమరీ విభాగాల్లో 10కి 10, సెకండరీలో 10కి 9 స్కోర్‌ పాయింట్లను ఏపీ సాధించింది. అలాగే విద్యార్థులు డ్రాపవుట్‌ కాకుండా ఒక తరగతి నుంచి పై తరగతుల్లోకి వెళ్లడంలో ప్రైమరీ నుంచి అప్పర్‌ ప్రైమరీ విభాగంలో 10కి 10, అప్పర్‌ ప్రైమరీ నుంచి సెకండరీ విభాగంలో 10కి 10 పాయింట్లను దక్కించుకుంది. అలాగే 1–8 తరగతులకు సంబంధించి బడిబయట ఉన్న విద్యార్థులను గుర్తించి వారిని తిరిగి బడిలో చేర్పించే అంశంలో కూడా 10కి 10 పాయింట్లు సాధించింది.  

ఫౌండేషనల్‌ విద్య బలోపేతంతోనే.. 
ముఖ్యంగా ఫౌండేషనల్‌ విద్య బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే కింది స్థాయి తరగతుల్లో విద్యార్థులు మెరుగైన సామర్థ్యాలను అందిపుచ్చుకోగలుగుతున్నారని పీజీఐ నివేదిక స్పష్టం చేస్తోంది. పీజీఐప్రామాణికాల్లో మొదటి అంశమైన ‘అవుట్‌కమ్స్, క్వాలిటీ’ల్లో ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలోని 3వ తరగతి విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు మెరుగుపడ్డాయి. దీంతో ఆ కేటగిరీలో 20కి 20పాయింట్ల స్కోర్‌ను ఏపీ సాధించింది. అలాగే 3వ తరగతి మ్యాథ్స్‌లో కూడా 20కి 20 పాయింట్లు వచ్చాయి. 5వ తరగతిలోనూ భాష, మ్యాథ్స్‌ల్లో 20కి 18 పాయింట్లు దక్కాయి. 8వ తరగతిలో భాషలో 20కి 16, మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ స్టడీస్‌ల్లో 14 చొప్పున పాయింట్లు వచ్చాయి. 

మౌలిక సదుపాయాల్లోనూ ప్రగతి 
మౌలిక సదుపాయాల విభాగంలో 12 అంశాలనుప్రామాణికంగా తీసుకున్నారు. రాష్ట్రంలో నాడు–నేడు తొలిదశ కింద 15,715 స్కూళ్లను రూ.3,600 కోట్లతో అభివృద్ధి చేశారు. రెండో విడత కింద మిగిలిన స్కూళ్లలో పనులుప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద అందిస్తున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్న భోజన పథకం అమలులో ఏపీ 10కి 10 పాయింట్లు సాధించింది.

విద్యార్థులకు యూనిఫామ్‌ అందించడం, పాఠ్యపుస్తకాల సరఫరా, మంచినీటి సదుపాయం కల్పనలో 10కి 9 పాయింట్లను దక్కించుకుంది. సప్లిమెంటరీ మెటీరియల్‌ను సమకూర్చడంలో 20కి 20 పాయింట్లు, 11, 12 తరగతులకు వొకేషనల్‌ విద్య అందించడంలో 10కి 10 పాయింట్లు సాధించింది. పరిపాలన, నిర్వహణకు సంబంధించిన 32 అంశాల్లో కూడా అత్యధికమైన వాటిలో పూర్తి స్థాయి స్కోర్‌ పాయింట్లను రాష్ట్రం దక్కించుకుంది.    

మరిన్ని వార్తలు