ట్రిపుల్‌ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

28 Mar, 2022 11:31 IST|Sakshi

నూజివీడు: స్థానిక ట్రిపుల్‌ఐటీ విద్యార్థిని మరడపు హారిక (19) ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం ఈసీఈ చదువుతున్న హారిక స్వస్థలం తూర్పుగోదా వరి జిల్లా రాజమండ్రి నగరంలోని కొత్తపేట. వేకువజామున 5.45 గంటల ప్రాంతంలో తాను ఉంటున్న కే–3 హాస్టల్‌ భవనంపై భాగంలోకి వెళ్లి అక్కడే బ్లేడ్‌తో రెండు చేతులకు మణికట్టు వద్ద, మెడవద్ద కోసుకొని ఆ తరువాత నాలుగంతస్తు పై నుంచి కిందకు దూకింది. విద్యార్థిని కిందకు దూకడంతో భారీగా శబ్దం రావడంతో పాల వ్యాను డ్రైవర్‌ చూసి వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన వచ్చి క్యాంపస్‌లోనే ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు.

 అయితే నైట్‌ డ్యూటీ వైద్యురాలు ఆస్పత్రిలో లేకపోవడంతో పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. రెండు కాళ్లకు, వెన్నుపూస వద్ద తీవ్ర గాయాలయ్యాయి. బ్లేడ్‌తో కోసుకోవడంతో తీవ్రంగా రక్తస్రావమైంది. క్షతగాత్రురాలికి రక్తం ఎక్కించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థిని స్పృహలోనే ఉండి ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరంలోని సెమిస్టర్‌–1 ఫలితాల్లో బ్యాక్‌లాగ్స్‌ ఉండటంతో భయంవేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పిందని ట్రిపుల్ఐటీ అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని నూజివీడు సీఐ ఆర్‌.అంకబాబు, పట్టణ ఎస్‌ఐ తలారి రామకృష్ణ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు