స్కూళ్లు కిటకిట..రెండేళ్లలో ఏకంగా 13 లక్షల మంది..

23 Jan, 2022 02:37 IST|Sakshi

రెండేళ్లలో ఏకంగా 13 లక్షల మందికి పైగా పాఠశాలల్లో చేరిక

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాకముందు 2018–19లో స్కూలు విద్యార్థులు 70 లక్షల మంది 

కానీ, 2021 నాటికి ఆ సంఖ్య 83.76 లక్షలకు చేరిక

అడ్మిషన్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌

పనులకు వెళ్లే పిల్లలు సైతం ఇప్పుడు బడిబాట

2020–21 సోషియో–ఎకనమిక్‌ సర్వే వెల్లడి

ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ఫలితమే ఇది

సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. గత రెండేళ్లలో ఏకంగా 13లక్షల మంది విద్యార్థుల అడ్మిషన్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. విద్యారంగానికి ప్రస్తుత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తూ చేపట్టిన కార్యక్రమాల ఫలితంగానే అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ఈ చేరికలు పెరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలు కునారిల్లి.. అడ్మిషన్లు తగ్గిపోయి, డ్రాపౌట్లు పెరిగిపోయిన పరిస్థితి నుంచి ఇప్పుడు చేరికల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ నిలబడుతోంది.

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే విద్యారంగానికి పెద్దపీట వేస్తూ అనేక సంస్కరణలు, సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పాఠశాలలకు సంబంధించి అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, మనబడి నాడు–నేడు, జగనన్న గోరుముద్ద వంటి కార్యక్రమాలు చేపట్టగా.. ఉన్నత విద్యకు సంబంధించి జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెనతో పాటు నాడు–నేడు కింద అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేయిస్తున్నారు. 

అకడమిక్‌ పరంగా సంస్కరణలు
ఇవేకాక.. సిలబస్, పాఠ్య ప్రణాళికల సంస్కరణలతో అకడమిక్‌ పరంగా కూడా అనేక మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపు ప్రధాన లక్ష్యంగా పాఠశాలల్లో అనేక వినూత్న కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. అలాగే, కళాశాల విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు డిగ్రీ హానర్స్‌ కోర్సులు, ఒక ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్, మైక్రోసాఫ్ట్‌ తదితర పేరెన్నికగన్న సంస్థల ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కొనసాగిస్తున్నారు. వీటన్నింటి ప్రభావం కారణంగా రాష్ట్రంలో ప్రతి తల్లి, తండ్రీ తమ పిల్లలను చదివించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో పాఠశాలలకు పంపిస్తున్నారు. గతంలో తమతో పాటు పనులకు పిల్లలను తీసుకువెళ్లే నిరుపేద కుటుంబాలు సైతం ఇప్పుడు తమ పిల్లలను స్కూళ్లకు వెళ్లేలా చేస్తున్నాయి. ఫలితంగానే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు మన రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. చివరికి ‘సీట్లు లేవు’ అని అనేక పాఠశాలలకు బోర్డులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి దేశంలో ఎక్కడా లేకపోవడం గమనార్హం.

రెండేళ్లలో ఎంతో మార్పు
ఇక రాష్ట్రంలో గడిచిన రెండేళ్లలో పాఠశాలల అడ్మిషన్లలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల విడుదలైన 2020–21 సామాజిక–ఆర్థిక (సోషియో–ఎకనమిక్‌) సర్వే గణాంకాల ప్రకారం.. 
► వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో (2018–19లో) రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య 70,43,071 కాగా.. 2020–21 నాటికి ఆ సంఖ్య 83,76,020కి చేరింది. అంటే రెండేళ్ల కాలంలోనే 13,32,949 మంది పిల్లల చేరికలు పెరిగాయి. 
► విచిత్రమేమంటే 23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతలా చేరికలు ఏనాడూ లేవు. 
► ఇక 2000–01 నుంచి చూసుకుంటే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం చేరికల సంఖ్య 75,01,162 మాత్రమే. 
► రాష్ట్రం విడిపోయే ముందు ఏడాది 2013–14లో 73,37,267  మాత్రమే విద్యార్థుల చేరికలు ఉన్నాయి. 
► 2014–15లో ఇది 72,32,771గా నివేదికల్లో పొందుపరిచారు. ఆ తరువాత నుంచి రాష్ట్రంలో చేరికలు 70 లక్షలలోపు మాత్రమే ఉన్నాయి. 
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక మాత్రమే ఒక్కసారిగా పాఠశాల విద్యలో మార్పులు చోటుచేసుకుని చేరికలు పెరిగాయి. 

మరిన్ని వార్తలు