‘అమ్మా ! నేను అందరిలా మళ్లీ బడికెళ్లగలనా..?'

23 Feb, 2022 08:10 IST|Sakshi
బోన్‌ క్యాన్సర్‌తో మంచానికి పరిమితమైన సుప్రజ 

బోన్‌ క్యాన్సర్‌తో చదువులకు దూరమైన విద్యార్థిని 

పేదరికం కారణంగా శస్త్రచికిత్స చేయించలేక తల్లిదండ్రుల సతమతం 

ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు 

సాక్షి, అనంతపురం: ‘అమ్మా ! నేను అందరిలా మళ్లీ బడికెళ్లగలనా? బాగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకుంటానమ్మా! ఎలాగైనా ఈ జబ్బు నయం చేయించు’ అంటూ కన్నీళ్లతో వేడుకుంటున్న కుమార్తెను చూసిన తల్లిదండ్రుల వేదనకు అంతు లేకుండా పోతోంది. మళ్లీ ఆమెను మునుపటిలా చేయాలనే తపన వారికీ ఉంది. అయితే పేదరికం కారణంగా శస్త్రచికిత్స చేయించలేని స్థితిలో మౌనంగా రోదిస్తున్నారు. కాలికి పుండులా వ్యాపించి భరించ లేని నొప్పితో విలవిల్లాడుతున్న తమ కుమార్తెకు శస్త్ర చికిత్స చేయించే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు.  

సంతోషాలకు బ్రేక్‌ పడిందిలా! 
బుక్కరాయసముద్రం మండలం విరుపాక్షేశ్వర నగర్‌కు చెందిన పేరూరు పురుషోత్తం.. నగరంలోని ఓ ఫ్యాక్టరీలో దినకూలీగా పనిచేస్తున్నాడు. భర్తకు తోడుగా భార్య పుష్పావతి సైతం చిన్నాచితక పనులతో సంసారాన్ని గుట్టుగా నెట్టుకొస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి సంకీర్తన.. డిగ్రీ చదువుతోంది. చిన్నమ్మాయి సుప్రజ.. నగరంలోని పాతూరు కస్తూరిబా బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆనందంగా సాగిపోతున్న సుప్రజ జీవితాన్ని అంతుచిక్కని వ్యాధి కకావికలం చేసింది. గత ఏడాది చివర కాలుపై కురుపులాంటిది కనిపిస్తే వైద్యం చేయించారు. భరించరాని నొప్పితో బాధపడుతుండడంతో వైద్య పరీక్షలు చేయిస్తే ‘బోన్‌ కాన్సర్‌ ’ అని తేలింది.

అనంతపురం సర్వజనాస్పత్రితో పాటు, కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేయించారు. నయం కాలేదు. తిరుపతిలోని స్విమ్స్‌లో వైద్యం చేయించారు. ఫలితం దక్కలేదు. హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స చేయాలని... ఆరోగ్యశ్రీ పరిధి దాటిపోవడంతో రూ.8 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని వైద్యులు సూచించారు. ఎక్కడ పది రూపాయలు తక్కువవుతుందని తెలిసినా గంపెడాశతో పరుగులు పెట్టిన ఆ కుటుంబానికి ప్రస్తుతం దిక్కు తోచలేదు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో బడికెళ్లి చదువుకోవాలనే తపన ఆ చిన్నారిలో మరింత ఎక్కువైంది. ఇలాంటి తరుణంలో తమ బిడ్డకు ప్రాణదానం చేసే ఆపన్న హస్తం కోసం నిరుపేద తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.  

దాతలు సంప్రదించాల్సిన చిరునామా
పేరు : పేరూరు పురుషోత్తం 
ఫోన్‌ నంబర్‌ : 63035 59280 
బ్యాంక్‌ ఖాతా నంబర్‌ : 1100 2614 0452 (కెనరాబ్యాంక్, సుభాష్‌రోడ్డు, అనంతపురం శాఖ) 
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌  : సీఎన్‌ఆర్‌బీ0000659 

>
మరిన్ని వార్తలు