దుఃఖం ‘ఒక్కటే’ మిగిలింది  

27 Feb, 2023 08:44 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థుల దుర్మరణం

ముగ్గురూ ఏకై క కుమారులే

ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు

గుడుపల్లె: ఉన్నత చదువులు పూర్తయి త్వరలోనే ఉద్యోగాలు అందుకోవాలనున్న వారి ఆశలను విధి తుంచేసింది. చదువుల్లో రాణిస్తూ సమాజంలో ఉన్నతంగా రాణిస్తారని కలలుగన్న తల్లిదండ్రుల కలలను చిదిమేసింది. కుప్పం- పలమనేరు జాతీయ రహదారిలో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం విషాదాన్ని నింపింది.

వివరాల ప్రకారం.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, పెనుబర్తి గ్రామానికి చెందిన సుచింద్రారెడ్డి కుమారుడు శ్రీవికాస్‌రెడ్డి(21), అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు రెడ్డివారిపల్లె గ్రామానికి చెందిన సుబ్బరాయుడు కుమారుడు ప్రవీణ్‌(24) కుప్పం పీఈఎస్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుతుండగా.. రాజంపేటకు చెందిన రమణయ్య కుమారుడు కల్యాణ్‌(20) మదనపల్లె మిట్స్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వీరు ముగ్గురూ మంచి స్నేహితులు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారులు కావడంతో అల్లారుముద్దుగా పెంచారు.

శనివారం సాయంత్రం మదనపల్లె నుంచి కుప్పం పీఈఎస్‌కు వచ్చిన కల్యాణ్‌.. ఆదివారం వేకువజాము 3 గంటల సమయంలో తన స్నేహితుని కారు తీసుకుని శ్రీవికాస్‌రెడ్డి, ప్రవీణ్‌తో కలిసి కుప్పానికి బయలుదేరారు. మార్గమధ్యంలో కుప్పం నియోజకవర్గం, గుడుపల్లె మండలం, చిన్నశెట్టిపల్లె వద్ద ముందు వెళ్తున్న లారీ ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. గుడుపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కన్నీరుమున్నీరు..
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుప్పం ఆస్పత్రికి చేరుకుని విగత జీవులుగా పడి ఉన్న తమ బిడ్డలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించడం కలచివేసింది. తమపై ఎన్నో ఆశలు పెంచుకున్నామని, ఉన్నత చదువులు చదివి తమను ఉన్నతంగా చూసుకుంటారని ఆశపడ్డామని, ఇంతలో తమ ఆశలు తుంచేసి వెళ్లిపోయా రా నాయనా అంటూ గుండెలవిసేలా రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది.

‘చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచాం. కష్టాన్ని నమ్ముకుని కడుపులో పెట్టుకుని చూసుకున్నాం. చదువుల్లో రాణిస్తున్నారని పైసాపైసా కూడబెట్టుకుని పెద్ద చదువులు చదివించాలని నిశ్చయించాం. పెద్ద ఉద్యోగం చేసి మా పేరు నిలబెడతారని కలలుగన్నాం. చరమాంకంలో తోడుగా నిలుస్తున్నారని ఆశలు పెంచుకున్నాం. మిమ్మల్నే తలుచుకుని జీవితాలు నెట్టుకొస్తున్నాం. ఇంతలోనే మమ్మల్నందర్నీ వదిలి అనంతలోకాలకు వెళ్లిపోయారా నాయనా.. మేమెట్టా బతికేది తండ్రీ’ అంటూ రోడ్డు ప్రమాదంలో ఒక్కగానొక్క కుమారులను పోగొట్టుకున్న తల్లిదండ్రుల గుండెలు పగిలేలా రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. కుప్పంృపలమనేరు రహదారిలో ఆదివారం వేకువజాము జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు విగతజీవులు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది.

మరిన్ని వార్తలు