మాంసం వినియోగంపై అధ్యయనం

8 Nov, 2020 03:32 IST|Sakshi
గొర్రెల పెంపకందారుల సమస్యలు తెలుసుకుంటున్న వ్యవసాయ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, తదితరులు

ఏపీ వ్యవసాయ మిషన్‌ ఆధ్వర్యంలో వివరాల సేకరణ 

పెంపకందారుల సమస్యలపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాల స్వీకరణ

అల్లానా సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ

సాక్షి, అమరావతి: మాంసం వినియోగంపై ఏపీ వ్యవసాయ మిషన్‌ అధ్యయనం చేస్తోంది. కొవిడ్‌–19 నేపథ్యంలో మాంసం వినియోగం పెరగాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ అందుకనుగుణంగా మాంసం ఉత్పత్తి లేకపోవడం, సమీప భవిష్యత్‌లో ఉత్పత్తి పెరిగే అవకాశాలు కనిపించకపోవడంతో ప్రభుత్వం దీనిపై దృష్టిని కేంద్రీకరించింది. మాంసం ఉత్పత్తి పెరగకపోవడానికి కారణాలు, పెంపకందారుల సమస్యలు, వారిని ప్రోత్సహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ మిషన్‌ ప్రతినిధులు, పశుసంవర్థక శాఖ సిబ్బంది వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇది పూర్తయ్యాక ప్రభుత్వానికి ఏపీ వ్యవసాయ మిషన్‌ నివేదిక సమర్పించనుంది.

దేశంలో 6 కిలోలు.. రాష్ట్రంలో 6.5 కిలోలు
రాష్ట్రంలో ప్రస్తుతం గొర్రెలు 176.26 లక్షలు, మేకలు 55.22 లక్షలు, పాడిపశువులు 46,00,087, దున్నలు 62,19,499, పందులు 91958, కోళ్లు 10.75 లక్షలు ఉన్నాయి. ఒక వ్యక్తికి ఏడాదికి 11 కిలోల మాంసం అందుబాటులో ఉంచాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సూచిస్తోంది. అయితే దేశంలో 6 కిలోలు, రాష్ట్రంలో 6.5 కిలోలు మాంసం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో మాంసం ఉత్పత్తి పెంపుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో పరిశీలన, పెంపకందారుల సమస్యలు, వారిని ప్రోత్సహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆధ్వర్యంలో వివరాలను సేకరిస్తున్నారు. వారం నుంచి రాయలసీమలో అభిప్రాయాలు తీసుకుంటున్నారు. వైఎస్సార్‌ జిల్లా కమలాపురం మండలం సీకె దిన్నెలోని సమీకృత గొర్రెల పెంపక కేంద్రం (గొర్రె పిల్ల పెంపకం నుంచి మాంసం ఎగుమతి వరకు)లో పరిస్థితులను తెలుసుకున్నారు. అలాగే చిన్న రైతులకు నాటుకోడి పిల్లలను పంపిణీ చేసేందుకు ఊటుకూరులో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని, అనంతపురం జిల్లా పెనుగొండలో గొర్రె పిల్లల కేంద్రాన్ని, బుక్కరాయ సముద్రంలోని లైవ్‌స్టాక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను సందర్శించారు.

పశుపోషకులకు మరింత లబ్ధి
రాష్ట్రంలో మాంసం ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇప్పటికే అల్లానా గ్రూప్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. విదేశాలకు మాంసాన్ని ఎగుమతి చేయడంలో ప్రసిద్ధి పొందిన ఈ సంస్థ తూర్పుగోదావరి జిల్లాలో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. పశుపోషకులకు ఈ యూనిట్‌ ఏర్పాటుతో మరింత లబ్ధి చేకూరనుంది. జిల్లాల్లోని పశుపోషకుల నుంచి మేలురకం మాంసం కొనుగోలు చేసి, ఇతర దేశాలకు ఎగుమతులు చేయడానికి ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. 
– ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వైస్‌ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్‌ 

>
మరిన్ని వార్తలు