ఆర్డీఎస్‌పై అధ్యయనం

10 Mar, 2022 05:37 IST|Sakshi

స్కీం లక్ష్యాలు నెరవేరుతున్నాయా? 

నెరవేరకపోతే కారణాలను తేల్చాలని కృష్ణా బోర్డు నిర్ణయం

కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై ప్రతిపాదనకు మూడు రాష్ట్రాల అంగీకారం

తెలంగాణ అక్రమంగా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతలను 

ఆపేయాలని పిళ్లై ఆదేశం  

సాక్షి, అమరావతి: రాజోలిబండ డైవర్షన్‌ స్కీం (ఆర్డీఎస్‌) లక్ష్యాలు నెరవేరుతున్నాయా? లక్ష్యాలు సాధించలేకపోతే దానికి కారణం నిర్వహణ లోపమా? డిజైన్‌ లోపమా? అనే అంశాలను తేల్చనున్నారు. ఈ అధ్యయనం బాధ్యతలను పుణెలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ )కు అప్పగించనున్నారు. ఈమేరకు కృష్ణా బోర్డు సభ్యుడు ఆర్కే పిళ్లై చేసిన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. అధ్యయనానికి ఆర్నెళ్ల గడువు ఇచ్చారు. వచ్చే రబీ నాటికి ఆ నివేదికను అమలు చేస్తామని ఆర్కే పిళ్లై చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు కార్యాలయంలో పిళ్లై అధ్యక్షతన ఆర్డీఎస్‌పై ప్రత్యేక సమావేశం జరిగింది.

తుంగభద్ర బోర్డు సభ్య కార్యదర్శి నాగమోహన్, ఏపీ సీఈ సి.మురళీనాథ్‌రెడ్డి, తెలంగాణ సీఈ మోహన్‌కుమార్, కర్ణాటక సీఈ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తుంగభద్ర జలాశయం నుంచి ఏపీకి చెందిన కేసీ కెనాల్‌ కోటా కింద విడుదల చేసిన నీటిని కర్ణాటక, తెలంగాణ మళ్లిస్తున్నట్లుగా జనవరి 28న బోర్డు జాయింట్‌ కమిటీ నిర్వహిం చిన క్షేత్రస్థాయి తనిఖీల్లో వెల్లడైంది. ఈ అంశాన్ని  పిళ్లై ప్రస్తావించారు. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను హరించడం సరికాదన్నారు. దీనిపై తెలంగాణ సీఈ స్పందిస్తూ.. ఆర్డీఎస్‌కు బచావత్‌ ట్రిబ్యునల్‌ 17.1 టీఎంసీలను కేటాయించిందని, ఇందులో తుంగభద్ర డ్యామ్‌ నుంచి 7 టీఎంసీలను విడుదల చేయాలని పేర్కొందని అన్నారు.

ఆర్డీఎస్‌ ఎడమ కాలువ కింద ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 87,500 ఎకరాల ఆయకట్టు ఉందని, ఏపీ జల చౌర్యం కారణంగా నీళ్లందక ఆ రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. దీనిపై ఏపీ సీఈ మురళీనాథ్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు.  ఈ దశలో పిళ్‌లై స్పందిస్తూ... కేసీ కెనాల్‌ కోటా కింద వి డుదల చేసిన నీటినే ఆర్డీఎస్‌ ఎడమ కాలువ ద్వారా కర్ణాటక, తెలంగాణ మళ్లిస్తున్నాయని తేల్చిచెప్పారు. దీంతో తెలంగాణ సీఈ మిన్నకుండిపోయారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ తమకు కేటాయించిన జలాలు దక్కడం లేదని తెలంగాణ సీఈ వాదించడంతో దాన్ని తేల్చేందుకు సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌తో అధ్యయనం చేయిస్తామని కృష్ణా బోర్డు తెలిపింది.

తుమ్మిళ్ల ఆపేయాల్సిందే..
తుంగభద్ర డ్యామ్‌ నుంచి కేసీ కెనాల్‌కు 10, ఆర్డీ ఎస్‌కు 7 టీఎంసీల కోటా ఉన్నందున నదిలో సహజప్రవాహం లేనప్పుడు.. తుంగభద్ర నుంచి 10:7 నిష్పత్తిలో నీటిని విడుదల చేసి.. దామాషా పద్ధతి లో ఆర్డీఎస్‌ వద్ద మూడు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయాలని ఏపీ సీఈ మురళీనాథ్‌రెడ్డి చేసిన ప్రతిపాదనను కృష్ణా బోర్డు అంగీకరించింది. ఆర్డీఎస్‌కు దిగువన సుంకేశుల బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో తెలంగాణ సర్కారు అక్రమంగా నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతలను నిలిపివేయాలన్న డిమాండ్‌తోనూ కృష్ణాబోర్డు ఏకీభవించింది.  తుమ్మిళ్ల ఎత్తిపోతలను ఆపేయాలని  ఆర్కేపిళ్లై ఆదేశించారు.  

మరిన్ని వార్తలు