మంత్రివర్గ ఉప సంఘం, సిట్‌ ఏర్పాటుపై తేల్చేస్తాం

1 Sep, 2020 03:55 IST|Sakshi

విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు

కేంద్రం, సీబీఐలను ప్రతివాదులుగా చేర్చాలన్న ఏజీ శ్రీరామ్‌

కోర్టుకు మంత్రివర్గ ఉప సంఘం నివేదిక అందజేత

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్ష జరిపేందుకు ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు, ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల సంగతి తుది విచారణ జరిపి తేల్చేస్తామని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజనీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

► రాష్ట్ర విభజన నాటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలను, పాలనాపరమైన చర్యలను, చేపట్టిన ప్రాజెక్టులను సమీక్షించేందుకు మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూన్‌ 26న జీవో 1411ను జారీ చేసింది.
► మంత్రి వర్గ ఉప సంఘం ఎత్తిచూపిన అవకతవకలను నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 21న జీవో 344 జారీ చేసింది. ఈ రెండు జీవోలను సవాలు చేస్తూ టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు వేర్వేరుగా హైకోర్టులో రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. 

కేసుల విచారణకు ఓ కోర్టు అవసరం : ఏజీ శ్రీరామ్‌
► మంత్రివర్గ ఉప సంఘం ఎత్తిచూపిన గత ప్రభుత్వ అక్రమాల తాలూకు వివరాలను కేంద్రానికి పంపి, సీబీఐ దర్యాప్తునకు ప్రాథమిక సమ్మతిని తెలిపాము. అందువల్ల ఈ వ్యాజ్యాల్లో తదుపరి విచారణ చేపట్టడానికి ముందు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు సీబీఐలను కూడా ప్రతివాదులుగా చేర్చాలి.
► సిట్‌ను పోలీస్‌స్టేషన్‌గా పరిగణిస్తున్న నేపథ్యంలో సిట్‌ నమోదు చేసే కేసులను విచారించేందుకు ఓ కోర్టు అవసరం అవుతుంది. కోర్టు ఏర్పాటు విషయంలో పాలనాపరంగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును లిఖిత పూర్వకంగా కోరాం.
► హైకోర్టు ఇప్పటి వరకు పాలనపరమైన నిర్ణయం వెలువరించలేదు. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది.
► ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ టి.రజనీ సోమవారం మరోసారి విచారణ జరుపుతూ.. ప్రాథమిక ఆధారాలను బట్టి కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా అవసరం లేదన్నారు. తుది విచారణ జరిపి ఈ వ్యాజ్యాలపై తేల్చేస్తానని చెబుతూ సెప్టెంబర్‌ 1కి విచారణ వాయిదా వేశారు. 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో చంద్రబాబు, ఆయన బినామీలు
► సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను కోర్టు ముందుంచింది. రాజధాని భూ కుంభకోణానికి సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికను కూడా కోర్టుకు సమర్పించింది.
► మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌.. తన పదవిని అడ్డం పెట్టుకుని ఎలా అధికార రహస్యాలు తెలుసుకుంటూ, తన సమీప బంధువుల ద్వారా కోర్‌ క్యాపిటల్‌ ఏరియాలో 41.64 ఎకరాలను కొన్నదీ వివరించింది. 
► ఈ 41 ఎకరాలకు పెట్టిన పెట్టుబడి రూ.4.9 కోట్లు అయినప్పటికీ, సీఆర్‌డీఏ ఒక్కో ఎకరాకు లెక్కించిన విలువ రూ.4 కోట్లు అని, వెరసి సుమారు రూ.169 కోట్లని తెలిపింది. రాజధాని భూముల విషయంలో 2014 జూన్‌ 1 నుంచి 2014 డిసెంబర్‌ 31 మధ్య కాలంలో 4,069.44 ఎకరాల లావాదేవీలను వివరించింది.
► ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వల్లే ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయంది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ సన్నిహితుడు వేమూరి రవికుమార్, మాజీ మంత్రి పరిటాల సునీత, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మరికొంత మంది టీడీపీ ముఖ్య నేతలు ఈ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో పాలుపంచుకున్నారని వివరించింది. 
► లింగమనేని రమేశ్, నారా లోకేష్, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, మాజీ మంత్రులు ప్రత్తిపాటి, రావెల కిషోర్‌బాబు, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, మాజీ ఎంపీ మురళీమోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు బినామీ లావాదేవీలు నిర్వహించారని పేర్కొంది.  

>
మరిన్ని వార్తలు