ఆంధ్రజ్యోతిపై పరువునష్టం కేసు ‘అత్యవసరం’

4 Feb, 2022 05:09 IST|Sakshi
కోర్టులో ఎంపీ సుబ్రమణ్యస్వామి

ఎంపీ సుబ్రమణ్యస్వామి

తిరుపతి లీగల్‌: తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, టీటీడీ పరువుకు భంగం వాటిల్లే విధంగా ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన కథనంపై టీటీడీ దాఖలు చేసిన పరువునష్టం కేసు అత్యవసర కేసుగా విచారణ చేపట్టాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యం, ఇతరులు కలసి రూ.100 కోట్ల పరువునష్టం చెల్లించేటట్టు ఆదేశించాలని తిరుపతి 10వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో టీటీడీ గత ఏడాది దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఎంపీ సుబ్రమణ్యస్వామి పిటిషన్‌ దాఖలు చేయడానికి గురువారం తిరుపతి కోర్టుకు వచ్చారు. ప్రస్తుతం కోర్టుల్లో వర్చువల్‌ విచారణ జరుగుతోంది. దీంతో ఆయన పిటిషన్‌ను కోర్టు రిసీవ్‌లో దాఖలు చేశారు.

పరువు నష్టం కేసులో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు మిగతా నలుగురు న్యాయకార్యపద్ధతి పాటించకుండా గత ఏడాది డిసెంబర్‌ 29న రిటర్న్‌ స్టేట్‌మెంట్‌ కోర్టులో దాఖలు చేశారు. ఆ స్టేట్‌మెంట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోరాదంటూ పిటిషన్‌లో కోరినట్టు తెలిసింది. ఆ పిటిషన్‌ దాఖలు చేసిన అనంతరం ఆయన స్థానిక కోర్టు ప్రధాన ద్వారం వద్ద మీడియాతో మాట్లాడారు. తనతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది సత్య సబర్వాల్‌ కేసు విచారణలో పాల్గొంటారన్నారు. కేసు శుక్రవారం విచారణకు రానున్నట్టు తెలిపారు. చట్టంలోని నియమాల విధానం ప్రకారం కేసు విచారణ చేపట్టాలని కోరనున్నట్టు పేర్కొన్నారు. ఎంపీ సుబ్రమణ్యస్వామి వెంట న్యాయవాదులు సత్య సబర్వాల్, ఎల్‌.మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు