త్వరలో రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు

20 Oct, 2020 04:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: రైతు బజార్లలో సబ్సిడీపై ఉల్లిపాయలు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌లో ఉల్లిపాయల ధర కిలో రూ.70 వరకు పలుకుతోంది. భారీ వర్షాలు, వరదల వల్ల ఈ ధర ఇంకా పెరిగే అవకాశాలుండటంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. గతేడాది లాగానే 40 వేల హెక్టార్లలో ఉల్లి పంటను రైతులు సాగు చేసినప్పటికీ, భారీ వర్షాల వల్ల దిగుబడి బాగా తగ్గిపోయింది. ఇదే పరిస్థితి మహారాష్ట్ర, కర్నాటకలోనూ ఉండటంతో ఉల్లి కొరత ఏర్పడింది. రాష్ట్రంలోని దిగుబడి సరిపోక.. వ్యాపారులు పలు రాష్ట్రాల నుంచి నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయాలు చేస్తున్నారు.

ఈ ఏడాది ఉల్లి నిల్వలు లేకపోవడంతో రానున్న రోజుల్లో కిలో రూ.100 వరకు చేరుకునే అవకాశముందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లోని ధరలు, వస్తున్న ఉల్లి నిల్వలు తదితర అంశాలను వారు పరిశీలిస్తున్నారు. నాఫెడ్‌ నుంచి ఉల్లిని కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా ధరల స్ధిరీకరణ నిధి నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తామని మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎస్‌.ప్రద్యుమ్న తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌తో చర్చించిన తర్వాత విక్రయపు ధరపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 

మరిన్ని వార్తలు