తనువు లేకున్నా.. తనుంది!

4 Jan, 2023 05:08 IST|Sakshi
దేవరశెట్టి సుచిత్ర

బ్రెయిన్‌ డెడ్‌తో ప్రొద్దుటూరు యువతి మృతి

ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యుల అవయవ దానం

మరికొందరికి జీవితాన్నిచ్చిన దేవరశెట్టి సుచిత్ర 

ప్రొద్దుటూరు క్రైం: తాను చనిపోయినా.. తన శరీరంలోని అవయవాలు పది మందికి ఉపయోగపడాలనే ఆమె గొప్ప ఆలోచన పలువురికి ప్రాణం పోసింది. అవయవ దానంతో యువతి ఆదర్శంగా నిలవడమే కాకుండా మరికొందరికి కొత్త జీవితాన్ని అందిస్తున్నది. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన దేవరశెట్టి సుచిత్ర (25) అనే యువతి బ్రెయిన్‌ డెడ్‌తో సోమవారం హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో మృతి చెందింది. ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు అవయవదానం చేశారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్‌కు చెందిన దేవరశెట్టి నరసింహులు, అనురాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో పెద్ద కుమార్తె రూపశరణ్య, చిన్న కుమార్తె సుచిత్ర. సుచిత్ర స్థానికంగా బీ ఫార్మసీ పూర్తి చేసింది. కొన్ని నెలల క్రితం నుంచి బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా, రూపశరణ్య బీటెక్‌ చేసి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. నరసింహులు విద్యుత్‌శాఖలో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసి రిటైర్డ్‌ అయ్యారు.

సుచిత్రకు డిసెంబర్‌ 31న తీవ్ర తలనొప్పిగా ఉందని చెప్పడంతో స్నేహితులు, తోటి ఉద్యోగులు హుటాహుటిన ప్రొద్దుటూరుకు తీసుకొచ్చారు. స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రిలో చూపించి వైద్యుల సూచన మేరకు ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్‌ చేయించారు. బ్రైయిన్‌లో రక్తం గడ్డకట్టిందని స్కానింగ్‌లో నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులు సుచిత్రను వెంటనే హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ ఆపరేషన్‌ జరిగినా కోలుకోలేక సుచిత్ర సోమవారం మృతి చెందింది. కాగా తమ కుమార్తె మరణానంతరం అవయవ దానం కోసం రిజిస్టర్‌ చేయించిందనే విషయాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రి వైద్యులకు తెలిపారు. దీంతో కిమ్స్‌ ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి యువతి శరీరంలోని నేత్రాలు, గుండె, మూత్రపిండాలు, వెన్నెముకను సేకరించి భద్రపరిచారు. మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూర్చులో అంత్యక్రియలు నిర్వహించారు.   

మరిన్ని వార్తలు