లాంగ్‌ కోవిడ్‌ వల్లే ఆకస్మిక మరణాలు.. వ్యాక్సిన్లే కారణమా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

14 Mar, 2023 03:13 IST|Sakshi

లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా ఆకస్మికంగా కుప్పకూలి మరణిస్తున్న ఘటనల్ని ఇటీవల చూస్తున్నాం. అలా కుప్పకూలి మరణించిన వారి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతు­న్నాయి.

ఈ మరణాలకు కోవిడ్‌ వ్యాక్సినే కారణమని.. కొన్నిరకాల మందులు వాడటం వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆ ప్రచారం నిజం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆకస్మిక మరణాలకు కారణాలను కార్డియాలజీ నిపుణులు వివరిస్తున్నారు.   

కోవిడ్‌ తర్వాత పెరిగిన గుండె సమస్యలు 
కోవిడ్‌ తర్వాత ప్రజల్లో గుండె జబ్బులు బాగా పెరిగినట్టు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా లాంగ్‌ కోవిడ్‌ ప్రాబ్లమ్స్‌ (పోస్ట్‌ కోవిడ్‌ కండిషన్‌) ఎదుర్కొన్న వారిలో గుండె జబ్బులు రెండు రెట్లు అధికమని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారిలోనే కార్డియాక్‌ అరెస్ట్‌లు జరుగుతున్నట్టు వెల్లడిస్తున్నారు.

ఆకస్మిక మరణాలతోపాటు, కొందరు పీఓటీఎస్‌ (పాచ్యురల్‌ టాచీకార్డియా సిండ్రోమ్‌) ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ఉన్న పొజిషన్‌ నుంచి మారినా, కూర్చుని, పడుకుని లేచినా గుండె దడగా ఉండటం జరుగుతుందని (కూర్చుని లేచిన తర్వాత లేదా పడుకున్న తర్వాత గుండె కొట్టుకునే రేటు చాలా త్వరగా పెరగటం) చెబుతున్నారు.  
ఇవీ కారణాలు 
రక్తనాళాల్లో పూడికల వల్ల గుండెపోట్లు వస్తున్నాయి.  
 గుండె కండరాలు ఉబ్బడం (మయో కార్డిటైస్‌) వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి. 
గుండె అకస్మాత్తుగా ఆగిపోవడం (కార్డియాక్‌ అరెస్ట్‌–అర్రిటమియా) కూడా కారణం. 
పల్మనరీ ఎంబోలిజం (గుండె నుంచి ఊపిరితిత్తులకు వచ్చే రక్తనాళాల్లో పూడికలు) కూడా దీనికి కారణమవుతోంది.  

ముందుగా గుర్తించడం కష్టమే 
కోవిడ్‌ తర్వాత కొందరిలో హార్మోన్ల సమతుల్యత లోపించిన కారణంగా రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి వారిలో డీ–డైమర్‌ వంటి పరీక్ష చేసినప్పుడు రక్తం చాలా సాధారణంగా ఉన్నా.. మరుసటి రోజుకే గడ్డలు ఏర్పడి పల్మనరీ ఎంబోలిజమ్‌తో అకస్మాత్తుగా మరణించే అవకాశాలు కూడా ఉన్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.

కార్డియాక్‌ అరెస్ట్, పల్మనరీ ఎంబోలిజంను ముందుగా గుర్తించడం కష్టమేనని పేర్కొంటున్నారు. రక్తంలో నీటి శాతం తగ్గినా రక్తం చిక్కబడి గడ్డలు ఏర్పడే అవకాశం కూడా ఉంది.  

అపోహలెన్నో.. 
ఆకస్మిక మరణాలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ కారణమని.. ఫలానా వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి గుండెపోటు వస్తోందంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వైద్యులు కొట్టిపారేస్తున్నారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ అత్యుత్తమ మార్గమని గుర్తించి అందరికీ వేయడం జరిగిందంటున్నారు.

పాశ్చాత్య దేశాల్లో వేసిన ఎంఆర్‌ఎన్‌ఏ (ప్రైజర్, మోడెర్నా) వంటి వ్యాక్సిన్లలో దుష్పలితాలను  గుర్తించారని, అవి మన దేశంలో వేయలేదని స్పష్టం చేస్తున్నారు.   

ముందు జాగ్రత్తలే మేలు 
గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవడం     ఎంతో మేలని వైద్యులు చెపుతున్నారు.  
♦ శ్రమతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం 
♦  జీవన శైలిని మార్చుకోవడం  
♦ స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం  
♦ రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం  
 ♦నీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు.  

లాంగ్‌ కోవిడ్‌ ప్రాబ్లమ్స్‌తోనే.. 
కోవిడ్‌ తర్వాత హార్ట్‌ ప్రాబ్లమ్స్‌ పెరిగాయి. లాంగ్‌ కోవిడ్‌ ప్రాబ్లమ్స్‌ (పోస్టు కోవిడ్‌ కమిషన్‌) ఉన్న వారిలో గుండె జబ్బులు  వచ్చే అవకాశం రెండు రెట్లు అధికం. ఆకస్మిక మరణాలకు పల్మనరీ ఎంబోలిజం, కార్డియాక్‌ అరెస్ట్‌లు కారణంగా ఉంటున్నాయి.

కోవిడ్‌ తర్వాత హార్మోన్లలో సమతుల్యత లోపించిన కారణంగా రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి. రక్తంలో నీటిశాతం తగ్గినా రక్తం చిక్కబడి గడ్డలు ఏర్పడతాయి. అలాంటి వారు ఆకస్మికంగా మరణించే అవకాశం ఉంది. జీవనశైలి మార్చుకోవడం, ఆహార నియమాలు పాటించడం, రెగ్యులర్‌ వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బులను అధిగమించవచ్చు.    
– బి.విజయ్‌ చైతన్య,  కార్డియాలజిస్ట్, విజయవాడ 

మరిన్ని వార్తలు