పోలీస్‌ విధులకు ఆటంకం కలిగించారు 

19 Feb, 2023 05:43 IST|Sakshi
ఇన్‌చార్జ్‌ ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి

విశాలమైన ప్రదేశాల్లో సభ నిర్వహించుకోవాలని సూచించాం

కావాల్సినంత పోలీస్‌ బందోబస్తు ఇస్తామని చెప్పాం

టీడీపీ నేత నల్లమిల్లికి అనుమతి కూడా అలాగే ఇచ్చాం

కానీ అనపర్తిలో చంద్రబాబు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ రోడ్డుపైనే సభ పెట్టారు

ఇన్‌చార్జి ఎస్పీ సుధీర్‌ వెల్లడి

సాక్షి,భీమవరం/రాజమహేంద్రవరం రూరల్‌/బిక్కవోలు: విశాలమైన ప్రదేశంలో సభ నిర్వహించుకునేందుకు అనుమతిచ్చినా పట్టించుకోకుండా.. రోడ్డుపై సభ పెట్టడమే కాకుండా.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకే టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు జవహర్, నిమ్మకాయల చినరాజప్ప తదితరులపై కేసు నమోదు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జ్‌ ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

శనివారం రాజమహేంద్రవరంలోని దిశ పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శుక్రవారం అనపర్తి నియోజకవర్గంలో ‘రాష్ట్రానికి ఇదేం ఖర్మ’ కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి కోరుతూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దరఖాస్తు చేశారు. రోడ్డుపై సభ నిర్వహించకూడదన్న షరతులతో వారికి అనుమతులిచ్చాం.

విశాలమైన ప్రదేశంలో, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సభ నిర్వహించుకోవాలని సూచించాం. కానీ పోలీసుల మాటలు పట్టించుకోకుండా.. బిక్కవోలు నుంచి అనపర్తికి చంద్రబాబు, టీడీపీ నేతలు ర్యాలీగా వస్తుండటంతో ఆర్‌ఎస్‌ పేట ఫ్‌లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద డీఎస్పీ భక్తవత్సలనాయుడు వారితో షరతుల ఉల్లంఘనపై చర్చించారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రులు జవహర్, నిమ్మకాయల చినరాజప్పతో పాటు వెయ్యి మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు ప్రోద్బలంతో పోలీసులను నెట్టుకుంటూ ముందుకు దూసుకొచ్చారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. ఈ ఘటనపై డీఎస్పీ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు వెయ్యి మందిపై బిక్కవోలు ఎస్సై బుజ్జిబాబు కేసు నమోదు చేశారు’ అని ఇన్‌చార్జ్‌ ఎస్పీ సుధీర్‌కుమార్‌ వివరించారు.

ఇరుకైన ప్రదేశం కావడంతో అనపర్తిలో రోడ్‌షోకు మాత్రమే అనుమతిచ్చామని.. సభకు అనుమతివ్వలేదని స్పష్టం చేశారు. గోకవరంలో చంద్రబాబు సభను అడ్డుకోలేదని తెలిపారు. కేసు విచారణ చేపట్టి సంబంధిత నేతలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సభ నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. 

ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు.. 
అనుమతులు లేని ప్రాంతాల్లో సభలు నిర్వహించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టబద్ధమైన చర్యలు తప్పవని ఐజీ జి.పాలరాజు చెప్పారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సభ నిర్వహణకు కళాక్షేత్రంతోపాటు బలభద్రపురం వద్ద పెద్ద లేఅవుట్‌ను సూచించి అక్కడ పూర్తిస్థాయి భద్రత కల్పి­స్తామని చెప్పినా వినకుండా.. చంద్రబాబు, టీడీపీ నేతలు పోలీసులను నెట్టేసి.. రోడ్డు పైనే సభ పెట్టా­రని పాలరాజు తెలిపారు.

ఇదే సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కొందరు బస్సు అద్దాలు పగలగొట్టడంతో పాటు పోలీసులపై రాళ్లు రువ్వారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం చంద్రబాబుకు రక్షణ కల్పించేందుకే పోలీసులు కొద్దిపాటి లాఠీచార్జి చేయాల్సి వచ్చిందన్నారు. రాళ్లు రువ్వినవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ రవిప్రకాష్, డీఎస్పీ బి.శ్రీనాథ్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు