తరం తల్లడిల్లుతోంది..!

17 Sep, 2023 04:14 IST|Sakshi

అత్యున్నత విద్యాసంస్థల్లో ఆత్మహత్యలా..?

బ్రిలియంట్‌ స్టూడెంట్స్‌ అనుకున్నవారూ బొక్కబోర్లా..

కఠిన పరీక్షలలో నెగ్గిన తర్వాత ఎందుకిలా..?

ఐఐటీలు, ఎన్‌ఐటీలలో పెరుగుతున్న ఆత్మహత్యలు..

ఒక్కసారిగా మారుతున్న అభ్యసన విధానం అలవడడంలేదా..

తల్లిదండ్రుల ఒత్తిడితో ఇష్టంలేని కోర్సులో చేరడమా..

నిపుణులేమంటున్నారు..విద్యార్థుల మనసులోని మాటేమిటి...?

చిల్లా వాసు, ఏపీ సెంట్రల్‌ డెస్క్‌
బాపట్లకు చెందిన చెన్నుపాటి యశ్వంత్‌ చాలా తెలివైన విద్యార్థి. గతేడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించాడు. ప్రతిష్టాత్మక ఐఐటీ గాంధీనగర్‌ (గుజరాత్‌)లో కంప్యూటర్‌ సైన్సులో సీటు వచ్చింది. అయితే చాలా దూరం కావడంతో జాతీయ స్థాయిలో మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్‌ఐటీ కాలికట్‌లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్సులో చేరాడు. తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషించారు.

యశ్వంత్‌కు ఉజ్వల భవిష్యత్‌ ఖాయమని, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ఉద్యోగం వచ్చేస్తుందని సంబరపడ్డారు. అయితే ఈ ఆనందం వారికి ఎంతో కాలం నిలవలేదు. ఆరు నెలలకే యశ్వంత్‌ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్‌ఐటీ కాలికట్‌ లాంటి ప్రముఖ విద్యా సంస్థలో సీటు సాధించి ఇలా ఆత్మహత్య చేసుకోవడం 
ఏంటని అందరూ నివ్వెరపోయారు.

...ఒక్క యశ్వంత్‌ మాత్రమే కాదు.. ఇలా ఎంతో మంది విద్యార్థులు ప్రముఖ విద్యా సంస్థలైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) వంటి వాటిలో సీట్లు సాధించి కూడా అర్ధంతరంగా ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపరుస్తోంది. కేంద్ర విద్యా శాఖ లెక్కల ప్రకారం.. 2018 నుంచి ఈ ఏడాది వరకు 33 మంది విద్యార్థులు ఐఐటీల్లో ఆత్మహత్య చేసుకున్నారు.

జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో  2018 నుంచి ఇప్పటివరకు 98 మంది విద్యార్థులు చనిపోతే వీరిలో 33 మంది ఐఐటీల విద్యార్థులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 2014–21లో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో 122 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం.. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. భారతదేశంలో 2017 నుంచి విద్యార్థుల ఆత్మహత్యల మరణాలు 32.15% పెరిగాయి. మరోవైపు కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల కర్మాగారంగా, కోచింగ్‌ హబ్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. 

సీటు ఎంత కష్టమంటే..
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఐఐటీలు. వీటి తర్వాత స్థానం ఎన్‌ఐటీలది. ఇంజనీరింగ్‌ విద్యకు పేరుగాంచిన ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశం కోసం ఏటా నిర్వహించే జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ (జేఈఈ) మెయిన్‌ని ఈ ఏడాది దేశవ్యాప్తంగా 11 లక్షలకుపైగా రాశారు. వీరిలో దాదాపు 2.5 లక్షల మందిని తదుపరి పరీక్ష అయిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేశారు. దేశంలో ఉన్న 23 ఐఐటీల్లో ఈ ఏడాదికి 17,385 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే.. 11 లక్షల మంది పరీక్ష రాస్తే చివరకు ఐఐటీల్లో ప్రవేశించేది 17,385 మంది మాత్రమే.

ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్‌ క్వాలిఫై అయినా సీట్లు రానివారు, జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు వచ్చినవారు ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, ఇతర జాతీయ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. జేఈఈ కోసం ఆరో తరగతి నుంచే ఐఐటీ ఒలింపియాడ్, కాన్సెప్ట్‌ స్కూళ్లలో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇందుకు లక్షల రూపాయలు ధారపోస్తున్నారు. ఇలా ఆరో తరగతి నుంచి ఇంటర్మిడియెట్‌ వరకు ఏడేళ్లపాటు కృషి చేస్తుంటే చివరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ఐఐటీల్లో చేరుతున్నారు. 

ఎందుకిలా..

 • ఓవైపు అకడమిక్‌ ఎగ్జామ్స్, మరోవైపు కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌..
 • ప్రాజెక్టు వర్క్, థీసిస్,ప్రాక్టికల్స్‌ కోసం సొంతంగా సిద్ధం కావాల్సి రావడం.
 • సొంత రాష్ట్రానికి చాలా దూరంగా వేరే రాష్ట్రాల్లో సీటు రావడం.. భాషలు, ఆహారం, వాతావరణం అలవాటుపడలేకపోవడం
 • గతంలో ఎంత సాధించినా.. ఐఐటీలు, ఎన్‌ఐటీలలో అసలు సిసలు పోటీ ప్రారంభమవడం. 
 • గతంలో బట్టీ పట్టేస్తే సరిపోయేది.. ఇపుడు సృజనాత్మకత అవసరం.. ఇక్కడ మేథస్సుకే పని. 
 • విద్యార్థులకు ఇష్టంలేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద కోర్సును ఎంపిక చేసుకోవడం.

ఏం చేయాలి?

 •  విద్యాసంస్థలలో మానసిక ఆరోగ్య సేవలను మెరుగుపరచాలి.
 • చాలా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, ఐఐఎంల్లో కౌన్సెలింగ్‌ సెంటర్లు ఉన్నాయి. వాటిని విద్యార్థులు ఉపయోగించుకోవాలి.  
 •  ఒత్తిడిని నివారించడానికి బిజినెస్‌ క్లబ్బులు, ఫొటోగ్రఫీ క్లబ్బు, కల్చరల్‌ క్లబ్బు, యోగా క్లబ్బు, మ్యూజిక్‌ క్లబ్బులు ఉన్నాయి. తమ ఆసక్తికి అనుగుణంగా విద్యార్థులు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. 
 • తల్లిదండ్రుల ధోరణి కూడా మారాలి. పిల్లల చదువులకు బాగా డబ్బు ఖర్చు పెట్టామనే ఉద్దేశంతో ఒత్తిడి పెంచడం, ఇతరులతో పోల్చి తిట్టడం వంటివి చేయకూడదు. 
 • స్కూల్, కళాశాల స్థాయిల్లోనే బట్టీ పట్టే చదువులకు స్వస్తి పలకాలి. పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించుకుని నేర్చుకునేలా చేయాలి.
 •  నిత్యం యోగా, ధ్యానం చేయించడంతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా చేయాలి.
 •  విద్యార్థులు సోషల్‌ మీడియా సైట్లు, సైబర్‌ బెదిరింపుల బారిన పడకుండా చూడాలి.

కొద్ది రోజులే ఇబ్బంది..
మాది బాపట్ల జిల్లా. నేను ఎన్‌ఐటీ జంషెడ్‌పూర్‌ లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఫస్టియర్‌ చదువుతున్నాను. మొదట్లో నాకు భాషా పరంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే ఇంటికి చాలా దూరంలో పరాయి రాష్ట్రంలో ఉండాల్సి రావడం కూడా కొంచెం సమస్యగా మారింది. అయితే ఆ బెరుకును ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న కౌన్సెలింగ్‌ సెంటర్‌ సిబ్బంది పోగొట్టారు. బోధన పరంగా సంప్రదాయ విధానానికి, ఎన్‌ఐటీల్లో విద్యకు తేడా ఉంది. ఇక్కడ బోధన చర్చ, విశ్లేషణ.. సంపూర్ణ అవగాహన అనే రీతిలో సాగుతోంది. కొంత అదనపు సమాచారాన్ని మా అంతట మేమే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. – ఎం. సుశ్వాంత్, బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్,థర్డ్‌ ఇయర్, ఎన్‌ఐటీ, జంషెడ్‌పూర్‌

కొంత సమయం పడుతోంది.. 
ఇప్పుడు 8వ తరగతి నుంచే జేఈఈకి సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచే విద్యార్థులపై ఒత్తిడి మొదలవుతోంది. ఇంటర్మిడియెట్‌ వరకు టీచర్‌ పాఠం చెప్పడం.. బోర్డుపైన రాయడం.. నోట్సు చెప్పడం.. తర్వాత దాన్ని బట్టీ పట్టడం వంటి సంప్రదాయ విధానాలకు అలవాటు పడిన విద్యార్థులు ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో కొత్త విధానాలను అలవాటు పడటానికి సమయం పడుతోంది. ఒక్కసారిగా ఇంటికి దూరం కావడం, వేరే ఎక్కడో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు రావడం వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో అంతగా స్కిల్స్‌ లేనివారే ఒత్తిడి బారిన పడుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, యోగా వంటివాటి వైపు విద్యార్థులను ప్రోత్సహిస్తే ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. ఆ దిశగా చర్యలు చేపట్టాలి. – ఎంఎన్‌ రావు, ఐఐటీ కోచింగ్‌ నిపుణులు, హైదరాబాద్‌ 
 
ప్రాథమిక దశలోనే నైపుణ్యాలు పెంపొందించాలి.. 
కేంద్ర విద్యా శాఖ ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేలా చర్యలు చేపట్టాలి. అన్ని రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించి విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. జేఈఈ రాసేవారిలో ఎక్కువ మంది సౌత్‌ ఇండియా వారే. వీరిలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటున్నారు. ఇంటర్‌లోగంటల తరబడి చదివి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల్లో ర్యాంకులు తెచ్చుకుంటున్న విద్యార్థులకు ఐఐటీల్లో అసలు పరీక్ష మొదలవుతోంది. అక్కడ ప్రొఫెసర్లు చెప్పిన కాన్సెప్‌్టతో విద్యార్థులే సొంతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యాలు లేనివారే ఒత్తిడికి గురవుతున్నారు. కొత్త విధానానికి అలవాటుపడలేనివారు మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో విఫలమవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సబ్జెక్టుల్లో బ్యాక్‌లాగ్స్‌ ఉంటున్నాయి. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు.      
– కె.లలిత్‌ కుమార్, డైరెక్టర్, అభీష్ట ఎడ్యుగ్రామ్‌ లిమిటెడ్‌  

మరిన్ని వార్తలు