ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సుజనా అడ్డగింత

14 Nov, 2020 03:08 IST|Sakshi

రెండేళ్లుగా ఆయనపై లుక్‌ ఔట్‌ నోటీసులు

సుజానాను అడ్డుకుని వెనక్కి పంపిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు

దీంతో హుటాహుటిన కోర్టులో హౌస్‌ మోషన్‌.. షరతులతో అనుమతినిచ్చిన హైకోర్టు  

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ మాజీ నేత (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు), రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరిని (సుజనా చౌదరి) ఢిల్లీలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. గురువారం ఆయన అమెరికా వెళ్తుండగా... ఆయనపై ఇప్పటికే లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ అయి ఉన్న కారణంగా అధికారులు నిలిపేసి... దేశం దాటి వెళ్లకూడదంటూ వెనక్కి పంపేశారు. నిజానికి బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజినీరింగ్‌ సంస్థకు సంబంధించి జరిగిన ఫ్రాడ్‌ వ్యవహారంలో 2016 ఏప్రిల్‌ 27న సుజనా చౌదరిపై ఈడీ కేసు నమోదు చేసింది.

ఆ తరవాత విచారణ జరుగుతూ వస్తోంది. ఇందులో భాగంగా ఆయన దేశం దాటి వెళ్లిపోకుండా గత ఏడాది జూన్‌ 18న సీబీఐ లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేసింది. రకరకాల డొల్ల కంపెనీలను పెట్టి, లేని టర్నోవర్‌ను చూపించి... వాటి ఆధారంగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని, దాదాపు 10వేల కోట్లు ఎగ్గొట్టిన వ్యవహారంలోనూ సుజనా నిందితుడు. తమకు అప్పు ఎగవేశారంటూ గతంలో మారిషస్‌ బ్యాంకు ఏకంగా ఇండియాకు వచ్చి మరీ ఇక్కడ కేసు దాఖలు చేసింది.  

కోర్టులో పిటిషన్‌; అనుమతి మంజూరు 
ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్న నేపథ్యంలో తనను అమెరికా వెళ్లేందుకు అనుమతించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన సుజనా చౌదరికి అక్కడ ఊరట లభించింది. అమెరికా వెళ్లేందుకు అనుమతిస్తూనే... భారత్‌కు తిరిగి వచ్చే తేదీని సీబీఐకి ఇవ్వాలని, భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత సీబీఐకి సమాచారం అందించాలని షరతు విధించింది. న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

అమెరికాలోని సుజనాచౌదరి బంధువు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆయన్ను చూసేందుకు వెళుతున్నారు కనుక అనుమతించాలంటూ సుజనా తరఫున సీనియర్‌ న్యాయవాది మాథూర్‌ హౌస్‌ మోషన్‌ దాఖలు చేసి వాదనలు వినిపించారు. గతేడాది జూన్‌ 18న సీబీఐ లుక్‌ఔట్‌ నోటీసులు జారీచేసిందని, దీని గడువు ఏడాది మాత్రమేనని మాథూర్‌ తెలిపారు. అయితే దీని గడువును మరో ఏడాది పొడిగించామని సీబీఐ స్పెషల్‌ పీపీ సురేందర్‌ చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్నాక న్యాయమూర్తి అనుమతి మంజూరు చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.   

మరిన్ని వార్తలు